Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాళేశ్వరం అంశంలో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మఅధికారంలోకి వచ్చినప్పటికీ.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
MLA MS Babu: టిక్కెట్ల విషయంలో దళితులకు అన్యాయం.. జగన్ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మేడిగడ్డ, కాళేశ్వరం నిర్మాణం తదితర కుంభకోణాలపై దర్యాప్తు చేయించడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేదని, అందుకే బీఆర్ఎస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో రేవంత్, కేసీఆర్ మధ్య అవగాహన కుదిరిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను విమర్శించారని, ఇప్పుడు సీఎం అయ్యాక ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ స్పందించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కిషన్ రెడ్డి విమర్శలకు సమాధానం ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు వారం రోజుల్లో ఆదేశిస్తామన్నారు. “ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. పదేళ్లు బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అందుకే బీజేపీ ఇన్నాళ్లూ స్పందించలేదు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయి నెలలు గడుస్తున్నా కిషన్ రెడ్డి ఇంతకాలం ఈ ప్రాజెక్టును ఎందుకు సందర్శింలేదు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడే దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్ విషయంలో విచారణ జరపకుండా ఎవరైనా ఆపారా..?” అని ఉత్తమ్ ప్రశ్నించారు.