Vande Bharat Trains: సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈ వారంలోనే వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న సికింద్రాబాద్‌లో ఈ రైలును ప్రారంభిస్తారు. ఈ రైలు ద్వారా సికింద్రాబాద్ నుంచి ఎనిమిదిన్నర గంటల్లోనే తిరుపతి చేరుకోవచ్చు. దేశంలో అత్యధిక వేగంతో ప్రయాణించగల లగ్జరీ రైళ్లు వందే భారత్. ఈ రైళ్లు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయి. దేశీయంగానే తయారైన వందే భారత్ రైలు విశేషాలివి.
ప్రాజెక్ట్ ట్రైన్-18
మన దేశంలో కూడా హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ ఆలోచన. 2015 నుంచి ప్రభుత్వ సహకారంతో కేంద్ర రైల్వే శాఖ ఈ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, అవేవీ సత్ఫలితాల్నివ్వలేదు. చివరకు 2017లో దేశంలోనే పూర్తి స్వదేశీ సాంకేతికతతో వీటిని తయారు చేయాలని నిర్ణయించారు. తర్వాత నిపుణులు డిజైన్ చేసిన రైలు నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. తమిళనాడు, చెన్నై పరిధిలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటి తయారీ ప్రారంభమైంది. ఈ రైలు తయారీ ప్రాజెక్టు పేరు ట్రైన్-18. 2017లో ప్రారంభమైన ఈ రైలు తయారీ 18 నెలల్లోనే పూర్తైంది. 2019 జనవరికల్లా తొలి రైలు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాతే ఈ రైలుకు కేంద్రం వందే భారత్ అని పేరు పెట్టింది. అప్పట్లో ఈ రైలును గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించాలని భావించారు. అయితే, మన దేశంలోని రైల్వే ట్రాకులు అంత వేగాన్ని తట్టుకునేలా లేవు. దీంతో రైలు వేగాన్ని గంటకు 130 కిలోమీటర్లకు పరిమితం చేశారు. కానీ, మొదటి రైలు నిర్మాణం పూర్తైన తర్వాత టెస్ట్ రన్ నిర్వహించారు. అప్పుడు ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.
తొలి రైలు 2019లోనే
వందే భారత్ రైలు గురించిన ప్రచారం ఇటీవలి కాలంలో ఎక్కువగా జరిగినప్పటికీ తొలి రైలు ప్రారంభమైంది 2019లో. ఆ ఏడు ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ-వారణాసి మధ్య తొలి రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. తర్వాత రెండో రైలు న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మధ్య 2019 అక్టోబర్ 3న ప్రారంభమైంది. మూడో రైలు గత ఏడాది సెప్టెంబర్ 30న ప్రారంభమైంది. ఈ రైలు గాంధీనగర్-ముంబై మధ్య ప్రయాణిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 10 వందేభారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ రైళ్లన్నీ గంటకు 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తున్నాయి. భవిష్యత్తులో మరింత వేగంగా ప్రయాణించల ట్రాకులు రూపొందిన తర్వాత వీటి వేగం ఇంకా పెరుగుతుంది. మరోవైపు రైలు సాంకేతికతను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నారు. మొదట వందేభారత్ 1.0గా ఉన్న సాంకేతికతను ఇప్పుడు 4.0 వరకు తీసుకురానున్నారు. గతంలో ట్రైన్-18గా పిలిచిన ఈ ప్రాజెక్టును త్వరలో ట్రైన్-20 పేరుతో చేపడుతారు. అంటే మరింత అభివృద్ధి చెందిన రైళ్లను ప్రవేశపెడతారు.
రైలు ప్రత్యేకతలివి
ఈ రైలులో 16 బోగీలుంటాయి. వీటిలో 14 ఏసీ చైర్ బోగీలు, 2 ఎగ్జిక్యూటివ్ చైర్ బోగీలుంటాయి. అన్నీ సెంట్రల్ ఏసీ బోగీలు. మొత్తం రైలులో 1,128 మంది కూర్చునేలా సీట్లు ఉన్నాయి. రైలు 140 సెకండ్లలోనే గరిష్ట వేగాన్ని అందుకోగలదు. వేగంగా ప్రయాణించేటప్పుడు ఎలాంటి కుదుపులకు గురి కాకుండా ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు. ఈ రైలు మొత్తం బరువు 392 టన్నులు. ఒక్కో రైలు తయారీకి రూ.115 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ రైలులో సీసీ కెమెరాలు, వైఫై, టీవీ స్క్రీన్స్, బ్యాక్టీరియా ఫ్రీ ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్, జీపీఐఎస్ బేస్డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రిక్లైనబుల్ సీట్స్, ఆటోమేటిక్ ప్లగ్ డోర్స్, టచ్ ఫ్రీ స్లైడింగ్ డోర్స్ వంటి సదుపాయాలున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణికులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి అందిస్తారు. ప్రయాణికులు ముందుగానే వాటికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
400 రైళ్ల తయారీ లక్ష్యం
గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 400 వందే భారత్ రైళ్లను తయారు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నిజానికి 2022 నాటికే 45 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రావాలి. కానీ, కోవిడ్ కారణంగా రైళ్ల తయారీకి ఆటంకం కలిగింది. మరోవైపు ఈ రైలు చక్రాల తయారీ కాంట్రాక్టును కేంద్రం అప్పట్లో యుక్రెయిన్‌కు ఇచ్చింది. అయితే, గత ఏడాది కాలంగా సాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం వల్ల రైలు చక్రాల తయారీ నిలిచిపోయింది. దీంతో చెక్ రిపబ్లిక్, పోలండ్, మలేసియా, చైనా, అమెరికాల్లోని కంపెనీలకు ఈ రైలు చక్రాల కాంట్రాక్టు అప్పగించింది. అలాగే మన దేశానికి చెందిన స్టీల్ అథారిటీ సంస్థ కూడా లక్ష చక్రాలు తయారు చేసేందుకు అంగీకరించింది. దుర్గాపూర్ ప్లాంట్ వద్ద ఈ చక్రాల తయారీ ఇప్పటికే ప్రారంభమైంది.
సక్సెస్.. కానీ..
వందే భారత్ రైలు విజయం సాధించింది. ఇప్పటికే ప్రారంభమైన రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, గత ఏడాది కొన్ని రైలు ప్రమాదాలు వివాదస్పదమయ్యాయి. కొన్ని చోట్ల రైళ్లు పశువులను ఢీకొనడం వల్ల రైలు ముందుభాగం దెబ్బతింది. దీంతో వీటి నాణ్యతపై చర్చ జరిగింది. అలాగే ఇంకొన్ని చోట్ల దుండగులు రైళ్లపై రాళ్లు వేస్తున్నారు. ఈ ఘటనల్లో పలుసార్లు రైళ్లు ధ్వంసమయ్యాయి. ఈ రైలు సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, విదేశాలు కూడా రైళ్ల కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దేశీయ అవసరాలు తీరిన తర్వాతే ఎగుమతులపై దృష్టి పెట్టాలని కేంద్రం భావిస్తోంది. కాగా, ఈ రైలు టిక్కెట్ ఛార్జీలు ఎక్కువగా ఉండటంపై కొందరు ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.
తిరుపతి రైలు ప్రత్యేకతలివి
సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈ నెల 8 నుంచి వందే భారత్ రైలు ప్రయాణిస్తుంది. ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభిస్తారు. ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు బయల్దేరి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు రైలు తిరుపతి చేరుకుంటుంది. సాధారణ రైళ్లు అయితే, రాత్రి పది గంటల తర్వాత తిరుపతి చేరుకుంటాయి. ఈ రైలుతో ఎనిమిదిన్నర గంటల్లోనే తిరుపతి చేరుకోవచ్చు. ఈ రైలుకు 9 లేదా 10 బోగీలు ఉండే అవకాశం ఉంది. సాధారణంగా వందే భారత్ రైళ్లకు 16 బోగీలుంటాయి. కానీ, వీటి ఛార్జీలు ఎక్కువ కాబట్టి, ప్రస్తుతానికి తక్కువ బోగీలనే ఏర్పాటు చేశారు. ప్రయాణికుల స్పందనను బట్టి బోగీల సంఖ్య పెంచుతారు.