బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్ట్ ప్రారంభమైంది. గబ్బా వేదికగా మొదలైన ఈ మ్యాచ్ కు తొలిరోజు వర్షం అంతరాయం కలిగించింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 5.3 ఓవర్ల పాటు ఆట జరగ్గానే వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత కాసేపటికే వర్షం ఆగిపోగా.. ఆట తిరిగి ప్రారంభమైంది. మరో 7.5 ఓవర్ల పాటు ఆట జరగ్గా వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో అంపైర్లు ముందుగానే లంచ్ బ్రేక్ ప్రకటించారు. దాంతో ఫస్ట్ సెషన్‌లో సగం ఆటను వరణుడు మింగేసాడు. వర్షంతో ఆట ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. దీంతో త్వరగానే లంచ్ బ్రేక్ ను ప్రకటించారు. ఇక్కడ నుంచి వర్షం మరింత పెరిగిపోవడంతో తొలిరోజు ఆట ముగిసినట్టు ప్రకటించారు.
గబ్బా బౌన్సీ వికెట్ కావడంతో ఆసీస్ ఓపెనర్లు ఆచితూచి ఆడారు. జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ బౌలింగ్ ను సమర్థంగానే ఎదుర్కొన్నారు. ఆట జరిగిన 13.2 ఓవర్లలో భారత పేసర్లు ఆసీస్ బ్యాటర్లను పెద్దగా ఇబ్బందిపెట్టలేకపోయారు. కొంచెం ఓవర్‌కాస్ట్ కండిషన్స్ తో పాటు పిచ్‌పై గ్రాస్ కూడా ఉండడంతోనే ఫీల్డింగ్ తీసుకున్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముందని అంచనా వేశాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. పేసర్ హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్, స్పిన్నర్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు ఈ మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు బ్రిస్బేన్‌లో వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. కాగా తొలిరోజు 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడడంతో మిగిలిన 4 రోజులు మ్యాచ్ త్వరగా ప్రారంభం కానుంది. 98 ఓవర్ల చొప్పున ఆట జరపాలని అంపైర్లు నిర్ణయించారు.ఒకవేళ ఈ మ్యాచ్ వర్షంతో రద్దయినా.. ఫలితం తేలకుండా ముగిసినా.. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి.