Vemireddy Prabhakar Reddy: అనిలే విలన్..? అనిల్ వల్లే వెళ్ళిపోతున్నా.. వేమిరెడ్డి మనో వేదన

అనిల్ మంత్రి అయ్యాక.. ఇతర నేతలతో వ్యవహరించే తీరులో మార్పు వచ్చింది. ఎన్నికలకు ముందు ఏ చిన్న విషయమైనా వేమిరెడ్డితో చర్చించే అనిల్.. తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చారు. నెల్లూరు జిల్లాలో అనిల్ అనుచరుల అక్రమాలను ఆపేయాలని వేమిరెడ్డి చెబితే ఆయన నుంచి స్పందన రాలేదు.

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 04:12 PM IST

Vemireddy Prabhakar Reddy: రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి ఎన్నో కారణాలున్నా.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో వచ్చిన విభేదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. 2019ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించడంలో వేమిరెడ్డిదే కీలకపాత్ర. ఇతర నియోజకవర్గాల కంటే నెల్లూరు సిటీలో టీడీపీ తరపున మాజీ మంత్రి నారాయణ పోటీ చేయడంతో.. వేమిరెడ్డి ఎక్కువ దృష్టి పెట్టి అనిల్ కుమార్ యాదవ్ విజయానికి పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. అనిల్‌తో పాటు మేకపాటి గౌతమ్ రెడ్డికి జగన్ క్యాబినెట్లో మంత్రి పదవులు దక్కాయి. అనిల్ మంత్రి అయ్యాక.. ఇతర నేతలతో వ్యవహరించే తీరులో మార్పు వచ్చింది.

Nara Bhuvaneswari: భువనేశ్వరి సరదా కామెంట్స్.. బాబుని ఆటాడుకుంటున్న వైసీపీ !

ఎన్నికలకు ముందు ఏ చిన్న విషయమైనా వేమిరెడ్డితో చర్చించే అనిల్.. తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చారు. నెల్లూరు జిల్లాలో అనిల్ అనుచరుల అక్రమాలను ఆపేయాలని వేమిరెడ్డి చెబితే ఆయన నుంచి స్పందన రాలేదు. దాంతో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జగన్ నుంచి కూడా రెస్పాన్స్ లేకపోవడంతో వేమిరెడ్డి కామ్ అయ్యారు. ఈ ఫిర్యాదు తర్వాత అనిల్ కుమార్ యాదవ్.. వేమిరెడ్డి మధ్య అంతరం పెరిగింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత అనిల్ స్థానంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి అవకాశం లభించింది. అప్పటి నుంచి కాకానితో వేమిరెడ్డి సన్నిహితంగా ఉన్నారు. ఇది అనిల్ వర్గంలో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. కాకాని మంత్రి పదవిని చేపట్టాక.. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జగన్ బాధ్యతలు అప్పగించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో కార్యక్రమాలు చేపట్టినా అనిల్ ఏనాడూ అటెండ్ కాలేదు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభకు పోటీ చేయాలని వేమిరెడ్డిని జగన్ కోరారు. మొదట్లో ఒప్పుకోలేదు. తర్వాత జగన్ ఒత్తిడితో ఓకే చెప్పారు. నెల్లూరు లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించిన వేమిరెడ్డి.. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి నియోజక వర్గాల్లో అభ్యర్థులను మార్చాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అనిల్‌కు నెల్లూరు సీటు దక్కదని ప్రచారం జరిగింది. ఆ స్థానంలో వేమిరెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తారనే టాక్ వచ్చింది.

Shanmukh Jaswanth: అమ్మాయిని బెదిరించి అన్న.. గంజాయి తాగుతూ తమ్ముడు.. ఇలా దొరికేశారు..!

తమ నేతను లక్ష్యంగా చేసుకొని వేమిరెడ్డి ఇలా చేస్తున్నారని అనిల్ వర్గీయులు అప్పట్లో పరోక్షంగా విమర్శలు చేశారు. అభ్యర్థులను మార్చాలన్న సూచన అధిష్టానం పట్టించుకోకపోవడంతో కొన్నిరోజులు రాజకీయ కార్యక్రమాలకు వేమిరెడ్డి దూరంగా ఉన్నారు. తర్వాత వేమిరెడ్డిని జగన్ పిలిపించి మాట్లాడాక నెల్లూరులో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఈ టైమ్‌లోనే నరసారావు పేట లోక్ సభ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా అనిల్ కుమార్ యాదవ్‌ను పార్టీ నియమించింది. అనిల్ అనుచరుడైన డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్‌ను నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించింది. జిల్లా మంత్రి కాకానితో పాటు.. వేమిరెడ్డికీ ఎలాంటి సమాచారం లేదు. ఈ నిర్ణయంతో వేమిరెడ్డి తీవ్ర మనస్థాపం చెందారు. వేమిరెడ్డిని ఎన్నికల్లో దెబ్బకొట్టేందుకే అనిల్ తన అనుచరుడిని తెచ్చారన్న ప్రచారం సాగింది. తన ఓటమికి అనిల్ ప్రయత్నిస్తున్నారని వేమిరెడ్డి భావించి కలత చెందారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పొలిటికల్ యాక్టివిటీస్ బంద్ చేయించి.. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లారు. పార్టీలో పరిణామాలపై వేమిరెడ్డితో మాట్లాడేందుకు ఢిల్లీలో జగన్ ప్రయత్నించినా.. అందుబాటులోకి రాలేదు.

వేమిరెడ్డి పార్టీని వీడకుండా సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయసాయిరెడ్డి.. చర్చలు జరిపారు. ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా వేమిరెడ్డి దగ్గరకు పంపారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ సీటుకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలనీ.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయనే హెచ్చరిక ధోరణిలో చెవిరెడ్డి మాట్లాడినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహించిన వేమిరెడ్డి తాను వైసీపీ తరఫున పోటీ చేయట్లేదని తేల్చిచెప్పేశారు. ఇది తెలిసిన వెంటనే వేమిరెడ్డితో టీడీపీ నేత నారాయణ సమావేశమయ్యారు. తమ పార్టీలోకి వేమిరెడ్డిని ఆహ్వానించారు. పార్లమెంటు సమావేశాల తర్వాత నెల్లూరుకు వచ్చిన వేమిరెడ్డి మరోసారి పార్టీ నేతలు.. అభిమానులతో సమావేశమయ్యారు. పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించి రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. వైసీపీకి వేమిరెడ్డి దూరమయ్యేందుకు. అనిల్ వ్యవహారమే కీలకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.