PURI BHANDAGARAM : ఆ రహస్య గదికి విషసర్పాలు కాపలా ! పూరీ ఖజానా తెరవాలంటే ఎందుకంత భయం

పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం జూలై 14న తెరుచుకోబోతోంది. 1978లో ఓపెన్ చేశాక తర్వాత ఇప్పటి వరకూ దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం జరగలేదు.

 

 

పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం జూలై 14న తెరుచుకోబోతోంది. 1978లో ఓపెన్ చేశాక తర్వాత ఇప్పటి వరకూ దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం జరగలేదు. 2018లో హైకోర్టు ఆదేశాలతో ఖజానా తెరవాలని ప్రయత్నించినా… ఆ రహస్య గది తాళాలు దొరక్కపోవడంతో ఆగిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ రహస్య గదిని 46 యేళ్ళ తర్వాత మళ్ళీ తెరుస్తున్నారు.

పూరీ జగన్నాథ ఆలయం ఖజానాలో ఎంతో విలువైన సంపద ఉంది. అందులో ఏమున్నాయి అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం రెండు ఖజానాలు ఉన్నాయి. పూరీ ఆలయ గర్భగుడి దగ్గర్లో ఉన్న ఖజానాలో… వజ్రాలు, బంగారం, వెండి వస్తువులు, పుణ్యక్షేత్రానికి చెందిన అమూల్యమైన ఆభరణాలు ఉన్నాయి. 1978లో ఖజానాను తెరిచారు. రెండు గదుల్లో 128 కిలోలకు పైగా 454 బంగారు వస్తువులు ఉన్నాయి. అలాగే 221 కిలోల బరువు గల 293 వెండి వస్తువులు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ ఆభరణాలన్నీ 1893 సంవత్సరంలో వాడుకలో ఉన్నవని చరిత్రకారులు చెబుతున్నారు.

పూరీ జగన్నాథ ఆలయం ఖజానాలో ఇంత విలువైన ఆభరణాలు ఎలా వచ్చాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కేశరి, గంగ వంశాల రాజులు, సూర్య వంశీ, భోయి రాజ వంశాల రాజులు… అలాగే నేపాల్ పాలకులు… వెండి, బంగారం, రత్నాలు, విలువైన వస్తువులు జగన్నాథుడికి విరాళంగా ఇచ్చారు. రాజు అనంగ భీమదేవ్ పూరీ జగన్నాథుడికి బంగారు ఆభరణాలు సిద్దం చేయడానికి లక్షా 25 వేల తులాల బంగారం విరాళంగా ఇచ్చినట్టు ఆలయ చరిత్రను వివరించే మదాల పంజి చెబుతోంది.య సూర్య వంశ పాలకులు జగన్నాథునికి విలువైన బంగారు ఆభరణాలు, బంగారం సమర్పించారు. గజపతిరాజు కలిపేంద్రదేవ్ 1466 సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల్ని జయించాక 16 ఏనుగులతో తెచ్చిన సంపదను ఆలయానికి విరాళంగా ఇచ్చారని శాసనాలు చెబుతున్నాయి. సాధారణ భక్తులు కూడా పూరీ జగన్నాథుడికి సమర్పించిన విలువైన వస్తువులను ఈ ఖజానాలో దాస్తున్నారు.

పూరీ జగన్నాథుడి ఆలయ ఖజానాలో 15 వందల యేళ్ళ క్రితం నాటి బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటిని లెక్కపెట్టాలంటే సమర్ధులు అవసరం. ఆడిట్ ప్రక్రియకి కూడా చాలా టైమ్ పడుతుంది. గతంలో 70 రోజుల పాటు ఈ ఆభరణాలను లెక్కించారు. ఈసారి నిపుణులైన స్వర్ణకారులు, మెట్రాలజిస్టుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పూరీ జగన్నాథ ఆలయ వ్యవహరాలను మేనేజింగ్ కమిటీ పర్యవేక్షిస్తోంది. ఆలయ కమిటీ ఐదో రూల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు లేకుండా ఖజానాలోని విలువైన వస్తువుల్ని బయటకు తీయకూడదు.

పూరీ ఆలయ ఖజానాకు… కాలకూట విషాన్ని చిమ్మే పాములు కాపలా ఉంటాయన్న విషయం అందర్నీ భయపెడుతోంది. ఈ ఖజానాకు పాములు రక్షణగా ఉంటాయని పురాణాలు, జానపద కథలు చెబుతున్నాయి. అందుకే ఖజానా తెరవడానికి ఆలయ కమిటీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. స్నేక్ క్యాచర్స్ తో పాటు పాములు కాటు వేస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ల బృందాన్ని కూడా రెడీ చేసింది. పూరీ జగన్నాథ ఆలయానికి చెందిన ఖజానాలో ఏముందన్నది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. మొత్తం సంపద విలువను లెక్కించడానికి మాత్రం రెండు నెలలకు పైగా టైమ్ పట్టే అవకాశం ఉందంటున్నారు.