రామ్‌గోపాల్‌వర్మ ఏ ముహూర్తాన ‘వ్యూహం’ సినిమా ఎనౌన్స్ చేశాడోగానీ, దాన్ని థియేటర్లలోకి తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నాడు. డిసెంబర్ 29 రిలీజ్ చెయ్యాలనుకున్నాడు. కానీ, కోర్టు సినిమాకి బ్రేక్ వేసింది. పైగా సెన్సార్ సర్టిపికెట్‌ను జనవరి 11 వరకు సస్పెన్షన్‌లో ఉంచింది. ఇదిలా ఉంటే.. తన కామెంట్స్‌తో ఎప్పుడూ వివాదాల్లోనే ఉండే వర్మ ఇప్పుడు మరో కొత్త సమస్య తెచ్చుకున్నాడు.
ఇటీవల బర్రెలక్క అలియాస్ శిరీష సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ పాపులారిటీతోనే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ కూడా చేసింది. ‘వ్యూహం’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు వర్మ. దీంతో సీరియస్ అయిన బర్రెలక్క రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె తరపు న్యాయవాది రాజేశ్ కుమార్ తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఆ ఆడియో ఫంక్షన్‌లో రామ్‌గోపాల్‌వర్మ ఏమన్నాడంటే.. ‘ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయిపోయింది. బర్రెలక్క బర్రెలు కాస్తుంది. బర్రెలు ఆమె మాటలు వింటాయి. అందుకే ఆమెను బర్రెలక్క అంటారు’ అన్నారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఎప్పుడూ ఎవరో ఒకరి మీద నోరు పారేసుకోవడం వర్మకు అలవాటుగా మారిపోయింది. కాంట్రవర్సీ అనేది లేకుండా సాపీగా జీవితం సాగిపోవడం వర్మకు ఇష్టం లేనట్టుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తుంటాడు.