అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కానున్నాడు. ట్ర్ంప్ టీంలో కీలకంగా ఉన్న జేడీ వాన్స్ అమెరికాకు ఉపాధ్యక్షుడు కాబోతున్నాడు. దీంట్లో న్యూస్ ఏముందు అనుకుంటున్నారా. బట్ ఉంది. ఈ జేడీ వాన్స్ స్వయానా మన తెలుగింటి అల్లుడే. ఏపీ కృష్ణాజిల్లాకు చెందిన ఉయ్యూరు అల్లుడు ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతున్నారు. ఆయన భార్య ఉషా చిలుకూరి భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టిపెరిగారు. యేల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్‌కు మేనేజింగ్ ఎడిటర్‌గా, యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ఎడిటర్‌గా పని చేశారు.
యేల్ విశ్వవిద్యాలయంలోనే ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో వీళ్ల పెళ్లి జరిగింది. హిందూ సంప్రదాయ పద్దతిలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. జేడీ వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. ఒహాయో స్టేట్ యూనివర్శిటీ, యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు. వాన్స్ 2022లో అమెరికా సెనేట్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఒహాయో సెనేటర్‌గా పోటీచేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ఆయన ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భర్త విజయంలో కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో భారత మూలాలున్న కమళా హ్యారిస్ అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి భారత మూలాలున్న కుటుంబానికి చెందిన వ్యక్తే ఉపాధ్యక్షుడు కాబోతున్నారు.