Truong My Lan: లక్ష కోట్ల మోసం.. మహిళా బిలియనీర్‌కు మరణశిక్ష

ఈ బ్యాంకును మోసం చేసిన ట్రూంగ్ మైలాన్ ఏకంగా 12.5 బిలియన్ డాలర్లను దారి మళ్లీ మళ్లించారు. ఇది 2022లో వియత్నాం జీడీపీలో దాదాపు 3 శాతానికి సమానం. దాదాపు పదేళ్ల కాలం నుంచి ఎస్‌సీబీ నుంచి ఆమె పెద్ద మొత్తంలో నగదు తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - April 11, 2024 / 07:26 PM IST

Truong My Lan: వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ టైకూన్, బిలియనీర్ ట్రూంగ్ మై లాన్‌కు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 12.5 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో లక్ష కోట్లకుపైగా మోసానికి పాల్పడ్డ కేసులో హోచిమిన్ నగరంలోని ఓ కోర్టు గురువారం ట్రూంగ్ మై లాన్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 67 ఏళ్ల ట్రూంగ్ మైలాన్.. ‘వాన్ థిన్ ఫాట్ హోల్డింగ్స్ గ్రూప్’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి చైర్‌పర్సన్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె అధీనంలోనే సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్‌ (ఎస్‌సీబీ) కూడా ఉంటుంది.

GIRL CHEATING: దొంగ ఆమే.. బాధితురాలూ ఆమే.. నువ్ మహానటివి తల్లి..

ఈ బ్యాంకును మోసం చేసిన ట్రూంగ్ మైలాన్ ఏకంగా 12.5 బిలియన్ డాలర్లను దారి మళ్లీ మళ్లించారు. ఇది 2022లో వియత్నాం జీడీపీలో దాదాపు 3 శాతానికి సమానం. దాదాపు పదేళ్ల కాలం నుంచి ఎస్‌సీబీ నుంచి ఆమె పెద్ద మొత్తంలో నగదు తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇలా 12.5 బిలియన్ డాలర్లు అక్రమంగా వాడుకుంది. ఇంత మొత్తాన్ని తన షెల్ కంపెనీలకు బదిలీ చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడి, ప్రభుత్వాధికారులకు లంచాలు ఇచ్చి, వేలాది ఫేక్ కంపెనీలు సృష్టించి ఆమె ఈ మోసానికి పాల్పడ్డట్లు విచారణలో వెల్లడైంది. ఇదే సమయంలో వియత్నాంలో 2022 నుంచి అక్కడి అవినీతి నిరోధక శాఖ కఠినంగా వ్యవహరించడంతో అదే ఏడాది అక్టోబర్‌లో ట్రూంగ్ లాన్ వ్యవహారం బయటపడింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. చివరకు ఆమె మోసం రుజువుకావడంతో కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. కాగా ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేయబోతున్నట్టు ట్రూంగ్ లాన్ న్యాయవాది తెలిపారు. ఇక.. ఈ కేసు విచారణ కూడా సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాల కోసం 104 పెట్టెలు అవసరమయ్యాయి.

ట్రూంగ్ మైలాన్‌తో పాటు మరో 85 మంది నిందితులు ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ట్రూంగ్ మైలాన్‌తో పాటు నిందితులంతా తమపై మోపిన అభియోగాలను ఖండించారు. ట్రూంగ్ మై లాన్, హోచి మిన్ సిటీలోని సైనో-వియత్నామీస్ కుటుంబం నుంచి వచ్చారు. మొదట ఆమె తన తల్లితో కలిసి సౌందర్య సాధనాలను విక్రయించే ఒక మార్కెట్ స్టాల్‌తో కెరీర్ ప్రారంభించారు. నెమ్మదిగా వ్యాపారరంగంలో ఎదుగుతూ.. 1990ల నాటికి ట్రూంగ్ భారీగా సంపాదించారు. హోటళ్లు, రెస్టారెంట్లు నెలకొల్పారు. 2011 నాటికి, ట్రూంగ్ మై లాన్ ‘హో చి మిన్’ సిటీలో ప్రసిద్ధ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఇదే సమయంలో బ్యాంకుల్ని మోసం చేయడం ప్రారంభించారు. దీంతో రెండేళ్లక్రితం ఆమె మోసాలు బయటపడగా.. ఇప్పుడు శిక్ష ఖరారైంది.