యూనివర్సిటీలోని కళాశాల భవనాల్లోనూ విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈసీ మెంబర్లకు, వీసీకి మధ్య గొడవలపై కూడా అధికారులు దృష్టి సారించారు. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని ఈసీ చర్యలకు దిగింది. వీసీ రవీందర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని రిజిస్ట్రార్‌ను మారుస్తామని ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా కొత్త రిజిస్ట్రార్‌ను నియమిస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ గందరగోళంగా మారింది. ఈసీ మెంబర్లకు, వీసీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది.
అక్రమ నియామకాలు, లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇప్పుడు రంగంలోకి దిగారు.
హైదరాబాద్‌లోని రూసా భవనంలో.. జూన్ నెల 3వ తేదీన పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు.. గతంలో పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. 60వ పాలక మండలి సమావేశానికి వీసీ రవీందర్ మరోసారి డుమ్మాకొట్టారు. వీసీ అక్రమాలు చేశారని.. దానిపై విచారణ కమిటీ వేయాలని సమావేశంలో పాలకమండలి మెంబర్లు ఏకగ్రీవంగా తీర్మానించారు.
వీసీ చేసిన అక్రమ నియామకాలు, ఇతరుల పేర్ల మీద బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేయడం, దినసరి ఉద్యోగం కింద పని చేసిన వారికి ఈసీ అనుమతి లేకుండానే బ్యాంకు నుంచి 28 లక్షల రూపాలు చెల్లించిన విషయాలకు సంబంధించి కమిటీని వేసి చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు.ఇలాంటి పరిణామాల మధ్య విజిలెన్స్ అధికారులు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించడంతో.. కలకలం రేగినట్లు అయింది.