తెలంగాణ బీజేపీ (Telangana BJP) నుంచి ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ఇప్పటికే కీలక నేతలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి.వివేక్ హస్తం పార్టీలోకి చేరారు. ఇంకా బీజేపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి (Vijayashanti) కూడా కాంగ్రెస్ లోకి చేరతారని టాక్ నడుస్తోంది.
గత కొంతకాలంగా బీజేపీ (BJP) లో జరిగే యాక్టివిటీస్ కి విజయశాంతి దూరంగా ఉంటున్నారు. పార్టీ చేపట్టిన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉన్నారు. మోడీ, నడ్డా, అమిత్ షా తెలంగాణలో నిర్వహించిన బహిరంగ సభల్లో కూడా ఆమె పాల్గొనలేదు. అసలు తనకు బీజేపీలో సరైన గుర్తింపు రావడం లేదని అసంతృప్తిగా ఉన్నారు. కేసీఆర్ (KCR) ను ఓడించడమే తన లక్ష్యమని ఎన్నోసార్లు ప్రకటించారు విజయశాంతి. తెలంగాణ వచ్చాక 9యేళ్ళల్లో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందనీ… సామాన్యులకు ఒరిగిందేమీ లేదని తరుచూ విమర్శలు చేస్తున్నారు. మొన్నటి దాకా మంచి ఊపు మీద కాషాయం పార్టీ ఇప్పుడు జోరు తగ్గింది. దానికి తోడు కాంగ్రెస్ పుంజుకోవడంతో.. విజయశాంతి కూడా కమలం పార్టీని వీడాలని భావిస్తోంది. పైగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపైనా రాములమ్మ కోపంగా ఉన్నారు.
అందుకే ఢిల్లీ స్థాయిలో AICC నేతలతో విజయశాంతి సంప్రదింపులు జరిపినట్టు చెబుతున్నారు. నేడో, రేపో ఆమె కాంగ్రెస్ లో చేరతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఈమధ్యే ఆ పార్టీలో జాయిన్ అయిన రాజగోపాలరెడ్డి, వివేక్ కు ఎంతో దగ్గరగా ఉండేవారు రాములమ్మ. వాళ్ళతో పాటే కాంగ్రెస్ (Congress) లో చేరతారని అందరూ అనుకున్నారు.
పార్టీ మారే వాళ్ళ జాబితాపై వారం, పది రోజులుగా విజయశాంతి పేరు బలంగా వినిపిస్తున్నా.. ఇప్పటిదాకా ఆమె ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే నాలుగు రోజుల క్రితం ట్విట్టర్ లో మాత్రం.. కాంగ్రెస్, బీజేపీ గురించి రాసుకుంటూ వచ్చారు. తాను రెండు పార్టీల్లోనూ కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేశాననీ .. సినిమాల్లో లాగా ద్విపాత్రాభియనం చేసి.. రెండు పార్టీల్లో ఉండటం కష్టమన్నారు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పనిచేయగలం కదా అంటూ ట్వీట్ చేశారు విజయశాంతి. అంటే పార్టీ మారుతున్నట్టా.. లేనట్టా అన్నది మాత్రం క్లియర్ గా చెప్పలేదు. పరోక్షంగా మాత్రం.. ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టుగా అభిప్రాయ పడ్డారు రాములమ్మ.
కాంగ్రెస్ లో సంప్రదింపులు పూర్తయ్యాయనీ.. కాంగ్రెస్ థర్డ్ లిస్టులో ఆమె పేరు ఉండచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి మాత్రం విజయశాంతికి మెదక్ పార్లమెంట్ టిక్కెట్ ఇస్తామని చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనీ.. 2024 ఏప్రిల్, మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ కన్ఫర్మ్ చేసినట్టు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో విజయశాంతి ఏ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.