Vijaysai Reddy: తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. తెచ్చిన పార్టీగా క్రెడిట్ సాధించడంలో మొదటి పదేళ్లు విఫలం అయిన కాంగ్రెస్.. ఎట్టకేలకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఐతే భారీ మెజారిటీ ఏమీ సాధించలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒకటే చర్చ. ఐదేళ్లు ఈ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అని ! బీఆర్ఎస్ నేతలయితే… ఓ అడుగు ముందుకేసి ఆరు నెలల్లో కూలిపోతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
CHANDRABABU NAIDU: ‘బటన్ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి’? జగన్‌ను ప్రశ్నించిన చంద్రబాబు
వీటన్నింటికి సీఎం రేవంత్ కౌంటర్ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు కూడా ! ఎవడ్రా నా ప్రభుత్వాన్ని కూల్చేదని ఓ మాట గట్టిగానే అనేశారు. ఇలాంటి పరిణామాల మధ్య… ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయ్. అది కూడా రాజ్యసభ సాక్షిగా ! ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందన్న విజయసాయి.. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారంటూ హస్తం పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినా 10ఏళ్లు అధికారం దక్కలేదని.. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. త్వరలో కూలడం ఖాయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్.
కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్‌కు అలవాటని.. దేశంలో అతిత్వరలో కాంగ్రెస్ కనుమరుగవుతుందంటూ విజయసాయి జోస్యం చెప్పారు. పార్లమెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయ్. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది.. హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వైసీపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. ఇలాంటి పరిస్థితుల మధ్య.. విజయసాయిరెడ్డి రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఐతే ఇదంతా ఎలా ఉన్నా.. విజయసాయి మాటలు నిజం అవుతాయా.. నిజంగా తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉందా.. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు వస్తాయా అని ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా కొత్త చర్చ మొదలైంది.