చంద్రుడి మీదకు మకాం మార్చేయాలన్నది కొన్నేళ్ల కల. జరగని ప్రయత్నం లేదు. చేయని ప్రయోగం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య చంద్రయాన్ ఒక హోప్‌గా మారింది. అందుకే ప్రపంచం అంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. చంద్రుడి మీదకు చేరిన చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్… జాబిల్లి ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు కొనసాగిస్తోంది. రోవర్ చంద్రుడిపై ఖనిజాల జాడను కనిపెట్టింది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ధృవీకరించింది. రోవర్‌లోని లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ పరికరం… దక్షిణ ధృవంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ ఉనికి పుష్కలంగా ఉన్నట్లు నిర్ధారించింది.
చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా పుష్కలంగా ఉన్నటు గుర్తించింది. వీటితో పాటు క్రోమియం, టైటానియం, కాల్షియం, మాంగనీస్, సిలికాన్, అల్యూమినియం, ఇనుము వంటి మరికొన్ని ఖనిజాలు కూడా ఉన్నట్లు గుర్తించింది. హైడ్రోజన్ కోసం ఇంకా రోవర్ పరిశోధిస్తోందని తెలిపింది ఇస్రో. చంద్రయాన్ బయటపెట్టిన విషయాలతో.. చంద్రుడిపై మనిషి నివసించటానికి అవసరమైన అన్ని మూలకాలు, పరిస్థితులను ఇస్రో గుర్తించినట్లు అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అరుదైన సల్ఫర్ జాడ కనిపించడం చాలా కీలకం కానుంది. సల్ఫర్‌ను మంచు నీటి ఉనికికి సంకేతం కావొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇదంతా ఎలా ఉన్నా.. ల్యాండర్ నుంచి రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్ 3 మిషన్ ఏమేం చేసిందనే వివరాలను ఇస్రో బయటపెట్టింది. దీని ప్రకారం ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు పూర్తి అయ్యాయ్. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ భూమిపైకి చేరవేసింది. చంద్రుడు చల్లగా ఉండడని, ఉపరితలంపై 70డిగ్రీల దాకా వేడి ఉంటుందని తేల్చింది. ఆగస్టు 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్‌ను పాటిస్తూ రోవర్ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ మిషన్‌కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.