అడిలైడ్ టెస్ట్ ఘోరపరాజయం నుంచి పూర్తిగా కోలుకోని టీమిండియా తర్వాతి మ్యాచ్ కోసం రెడీ అవుతోంది. మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న బ్రిస్బేన్ కు భారత జట్టు చేరుకుంది. వచ్చీ రాగానే ప్రాక్టీస్ షురూ చేసింది. గబ్బా వేదికగా ఇరు జట్లు మూడో టెస్టులో తలపడనున్నాయి. గబ్బా పిచ్ ఫాస్ట్ బౌలర్ల స్వర్గధామంగా ఉంటుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే సిరీస్ లో పైచేయి సాధించినట్టే. సో ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియాను సన్నద్ధం చేస్తున్నాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. అలాగే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఓ కన్నేసి ఉంచాడు. ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా హిట్ మ్యాన్ తన బలహీనతలను అధిగమించలేకపోతున్నాడు. ఒకప్పుడు టీమిండియాను సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించిన కెప్టెన్ రోహిత్ తడబాటుకు గురవుతున్నాడు. ఇటీవలి టెస్ట్ మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోవడం, కెప్టెన్‌గా వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఒత్తిడి పెరుగుతోంది.
తొలి టెస్టు ఆడని రోహిత్ శర్మ రెండో టెస్టులో ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ రెండు ఇన్నింగ్స్‌ల్లో మూడు, ఆరు పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరగగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బౌల్డ్ చేశాడు. మంగళవారం రోహిత్ నెట్స్‌కు రాగానే అందరి దృష్టి అతనిపైనే పడింది. ముందుగా స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మరియు వాషింగ్టన్ సుందర్‌ల స్పిన్ త్రయాన్ని ఎదుర్కొంటూ రోహిత్ తన సెషన్‌ను ప్రారంభించాడు. ఈ సమయంలో ఆకాష్ దీప్, ముఖేష్ కుమార్, యశ్ దయాల్ మరియు కొంతమంది త్రోడౌన్ స్పెషలిస్ట్‌ల వంటి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ముందుకు సాగాడు. అయితే ఇక్కడ కూడా రోహిత్ నిరాశపరిచాడు. ఫాస్ట్ బౌలర్లకు వ్యతిరేకంగా తప్పుడు షాట్లు ఆడాడు.
విరాట్ కోహ్లీ కూడా బ్యాడ్ స్టార్ట్ చేశాడు. హర్షిత్ రాణా, నవదీప్ సైనీలు కోహ్లీని చాలాసార్లు అవుట్ చేశారు. ఈ సెషన్లో విరాట్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. యశస్వి జైస్వాల్ కోహ్లి షాట్స్ చూస్తూ ఫిదా అయ్యాడు. షాట్ హై పాజీ అంటూ ప్రశంసించాడు. ఇకపోతే మూడో టెస్టులో యశస్వి, కోహ్లి, గిల్‌లతో సహా ఇతర బ్యాటర్లపై గంభీర్ ఫోకస్ పెట్టాడు. పుల్ షాట్ టెక్నిక్ మరింత మెరుగయ్యేలా యశస్వికి గంభీర్ పలు సూచనలు చేశాడు. నెట్ సెషన్ లో గిల్ , రాహుల్ నెట్స్‌లో కాన్ఫిడెంట్ గా కనిపించారు. రాహుల్ ఫాస్ట్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. అయితే అతను గబ్బాలో ఓపెనింగ్ చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక నెట్స్ లో చెమటోడ్చుతున్న ఆకాష్ ,ప్రసిద్ధ్ కృష్ణ ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. అయితే టీమ్ మేనేజ్ మెంట్ హర్షిత్ రాణావైపు మొగ్గచూపుతున్నట్టు తెలుస్తోంది.