Administrative capital of AP: విశాఖ కేంద్రంగా పరిపాలనకు సర్వం సిద్దం.. తాజాగా జీవోలు జారీ చేసిన సీఎస్

దసరా నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ వేదికగా పాలన సాగించేందుకు సర్వం సిద్దం చేశారు. దీనికోసం క్యాబినెట్ మంత్రులు, కార్యదర్శులు, ప్రదాన అధికారులు మొత్తం విశాఖలో వసతులు సమకూర్చుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 11:33 AM IST

ఏపీ పరిపాలనా రాజధాని విషయంలో రోజుకో ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తోంది. గతంలో అమరావతి నుంచి పరిపాలనను ఇతర ప్రాంతాలకు తరలించవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే మూడు రాజధానుల అంశం సుప్రీం కోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం రెండు జీవోలు బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ జీవో నంబర్ 2004, 2015 లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు సీఎస్ జవహర్ రెడ్డి.

వసతుల కోసం కమిటీ పర్యటన..

గతంలో సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారు. దీనిని అనుసరిస్తూ ఉత్తరాంధ్ర అభివృద్దే లక్ష్యంగా నిరంతరం సమీక్షా, సమావేశాలు జరపాలని భావిస్తున్నారు. అందుకే సీఎం పేషీ కోసం ప్రత్యేక భవనాలు నిర్మించారు. ఇందులో సీఎంవో అధికారులతో పాటూ ప్రతి శాఖకు సంబంధించిన కార్యదర్శులు, ఉన్నతాధికారులు, హెచ్ఓడీలు, ప్రత్యేక ఆఫీసర్లు విశాఖకు మారాల్సి ఉంటుంది. వీరికి ప్రత్యేక వసతుల కోసం ఒక బృందం ఇప్పటికే విశాఖలో పర్యటిస్తోందని తెలుస్తోంది. దీనిని దొంగ చాటుగా పరిపాలన రాజధాని తరలిస్తున్నారని భావిస్తున్నారు కొందరు. పైగా కోర్టు ఆదేశాలను దిక్కరించినట్లవుతుందని మరి కొందరు చర్చించుకుంటున్నారు.

నాయకుల భిన్నాభిప్రాయాలు..

దీనికి బదులుగా వైసీపీ ప్రభుత్వం.. మేము కార్యాలయాలను ఎక్కడికీ తరలించడం లేదని, కేవలం అక్కడి సమీక్షా, సమావేశాల కోసమే ఇలా చేస్తున్నామని బదులిస్తున్నాయి. ఇక్కడి కార్యాలయాల్లో సిబ్బంది ఉంటారని, పూర్తిస్థాయి పని ఇక్కడి నుంచే సాగుతుందని అమరావతిని ఉద్దేశించి చెబుతున్నారు. మరి కొందరైతే నాలుగున్నరేళ్ళ పాలనలో ఎప్పడూ ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంగా గుర్తుకు రాలేదా అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి అభివృద్ది చేయలేదు. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లాయని మండిపడుతున్నారు. ఈ తరుణంలో కొంతో గొప్పో అభివృద్ది అయిన అమరావతిని కూడా ఉత్తరాంధ్ర అభివృద్ది పేరుతో నాశనం చేయాలని చూస్తున్నట్లు టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

మౌళికసదుపాయాల కల్పనే లక్ష్యం..

సాధారణంగా ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలతో కూడి ఉంటుంది. వీటిలో కొన్ని అభివృద్ది పరంగా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. వీటికి నిధులు ఈ ప్రాంతాల చుట్టూ ఉండే జిల్లా కేంద్రంగానే వస్తూ ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాలలోని విద్య, వైద్యం, తాగునీరు, రవాణా వంటి అంశాలపై మరింత ప్రత్యేక శ్రద్దపెట్టి అభివృద్ది చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జీవో నంబర్ 2015లో పేర్కొన్నారు. అందుకే ఈ సరికొత్త జీవోను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి బాటలోనే మంత్రులు

ఉత్తరాంధ్ర వేదికగా ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల సంక్షేమం ఏస్థాయిలో ప్రజలకు అందుతుందో తెలుసుకోవచ్చు. అందుకే విశాఖలో ముఖ్యమంత్రి జగన్ మకాం మార్చేందుకు సిద్దమయ్యారు. దీనికి సంబంధిత శాఖా మంత్రులు కూడా అవసరం అవుతారు. వీరు కూడా విశాఖ చుట్టుపక్కల వసతి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ఇక్కడ ఉండి పని చేస్తున్నప్పుడు మిగిలిన శాఖాధిపతులు, అక్కడే ఉండి వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. వీలైతే కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట బస కూడా చేయాల్సి ఉంటుంది అని జీవోలో పేర్కొన్నారు. దీని కోసం మంత్రులకు ఎప్పటికప్పుడు కార్యదర్శులు, హెచ్ఓడీలు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో వసతి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్, రెవెన్యూ, సాధారణ పరిపాలన శాఖ అధికారులు ఇప్పటికే వసతి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై పురోగతిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి రిపోర్ట్ అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

పరిపాలనకు అంతా సిద్దం..

విశాఖ కేంద్రంగా ఉన్న రుషికొండలో ముఖ్యమంత్రి నివాసానికి, సీఎం కార్యాలయానికి సంబంధించిన నిర్మాణాలు మొత్తం సిద్దమయ్యాయి. వీటిని టూరిజం ప్రాజెక్ట్ పేరుతో అనుమతులు తీసుకుని నిర్మించారు. సాధారణంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడైనా ఉండోచ్చు. ఎక్కడి నుంచైనా పరిపాలన సాగించవచ్చు. అందుకే విశాఖను కేంద్రంగా చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించినట్లు తెలిపారు అధికారులు. మరో రెండు మూడు రోజుల్లో రుషికొండలో నిర్మించిన ప్రభుత్వ భవనాలు సీఎం సెక్యూరిటీకి అప్పగిస్తారు. అక్కడి భద్రత, స్థానిక పరిస్థితులు, వసతులు అన్నీ సరిచూసుకుని సీఎం కార్యాలయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తారు. దసరా నుంచి సీఎం జగన్ తన అధికారిక కార్యకలాపాలను ఇక్కడి నుంచే చేపడతారు. ఈలోపు అధికార యంత్రాంగం మొత్తం సుపరిపాలన అందించేందుకు సిద్దంగా అందుబాటులో ఉండాలని తాజాగా జీవోలు జారీ చేశారు.

T.V.SRIKAR