ప్రపంచ అథ్లెటిక్స్ లో తెలుగమ్మాయి స్వర్ణం పతకం సాధించడం మన దేశానికే గర్వకారణం. వైజాగ్ కు చెందిన జ్యోతి యారాజీ ప్రపంచానికి తన క్రీడాస్పూర్తిని చాటి చెప్పింది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 100 మీటర్ల హర్డిల్స్ లో తన సత్తా చాటింది. కేవలం 13.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోవడం గమనార్హం. ఈమె వయసు 23 సంవత్సరాలు. ఆసియా క్రీడల్లో అడుగు పెట్టడం తొలిసారి. మొదటి ప్రయత్నంలోనే బంగారు పతకాన్ని గెలుచుకోవడం అంటే ఈమె పట్టుదల ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ఘన కీర్తిని మన దేశానికి అందించిన ఈమె కుటుంబ నేపథ్యం ఒక్కసారి చూద్దాం.
జ్యోతి తండ్రి సూర్యనారాయణ ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ జాబ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తల్లి కుమారి నగరంలోని ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తున్నారు. ఇలా తమకు వచ్చిన కొద్దిపాటి సంపాదనతోనే క్రీడల పట్ట ఆసక్తితో కఠోరమైన శ్రమను, లక్ష్యసాధనలో వచ్చిన కష్టాలను, కుటుంబ పరిస్థితులన్నింటినీ తన పంటి కింద అణచి పెట్టుకున్నారు జ్యోతి. ఈ కసిని తన 100 మీటర్ల హర్డిల్స్ పై చూపించారు. దీంతో విజయ లక్ష్మి ఈమెను వరించింది. పేదరికంలో ఉన్న మజా ఒక్కసారైనా అనుభవిస్తేనే తెలుస్తుంది. బ్రతికితే పేదోడిగా బ్రతికి ఇలాంటి అరుదైన, అద్భుతమైన చిత్రను సృష్టించి తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించాలని పదిమందికి ప్రేరణను ఇస్తుంది. ఇలాంటి వారిని ప్రభుత్వాలు, స్పాన్సర్ షిప్ కంపెనీలు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తే మన దేశం క్రీడల్లో మరిన్ని పతకాలు సాధించడం ఖాయమని చెప్పవచ్చు.
T.V.SRIKAR