Pawan Kalyan: పవన్ వల్లే సోము వీర్రాజు పదవి ఊడిందా ?

ఏపీ బీజేపీ చీఫ్ మారారు. ఎన్టీఆర్ తనయ పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పజెప్పింది బీజేపీ హైకమాండ్‌. నిజానికి అధ్యక్షుడిని మారుస్తారని చర్చ జరిగినా.. సత్యకుమార్‌, సుజనా చౌదరిలో ఒకరికి పదవి అప్పగిస్తారనే అంచనాలు వినిపించాయ్. కట్ చేస్తే పురంధేశ్వరి పేరు అనౌన్స్ చేయడంతో.. అంతా అవాక్కయిన పరిస్థితి.

  • Written By:
  • Publish Date - July 4, 2023 / 07:00 PM IST

పార్టీని పరుగులు పెట్టిందుకు పురంధేశ్వరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు.. ఏం చేస్తారన్న సంగతి పక్కనపెడితే.. అధ్యక్షుడిగా ఇంకా పదవీకాలం ఉన్నా.. సోమువీర్రాజును అకస్మాత్తుగా ఎందుకు తొలగించారన్నదే హాట్‌టాపిక్‌గా మారుతోంది. సోము పదవి ఊడడం వెనక పవన్ కల్యాణ్ చేసిన కంప్లైంట్ కారణమా అనే చర్చ జరుగుతోంది. సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్నప్పుడే.. జనసేనతో పొత్తు కుదిరింది. పొత్తు అన్న మాటే కానీ.. కలిసి నడిచింది లేదు.. కలిసి కనిపించింది లేదు. పవన్ ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే సోము వీర్రాజు పనిగా పెట్టుకున్నారనే చర్చ జరిగింది ఓ సమయంలో ! వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి నడిచే వ్యవహారంలో పవన్‌తో ప్రధానంగా విభేదించింది కూడా సోము వీర్రాజే ! పొత్తుగానే ఎన్నికలకు వెళ్తామని జనసేన ఆవిర్భావ వేడుక సాక్షిగా పవన్ ప్రకటన చేసిన తర్వాత.. బీజేపీ పెద్దలు ఆయనను ఢిల్లీకి పిలిపించుకున్నారు.

పవన్‌ కూడా రెండు రోజులు హస్తినలో బిజీగానే గడిపారు. ఆ తర్వాత పొత్తుల వ్యవహారంలో పవన్ సైలెంట్ అయ్యారు. ఐతే ఆ భేటీలోనే సోము వ్యవహారంపై.. బీజేపీ పెద్దలకు పవన్ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అప్పుడే పవన్‌కు హైకమాండ్ నుంచి హామీ లభించిందని.. అందుకే చాలారోజులు మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. బీజేపీ పెద్దలు పవన్‌ను భయపెట్టారని రకరకాల చర్చ జరిగినా.. ఆ మౌనం వెనక అసలు కారణం ఏంటో ఇప్పుడు అర్థం అవుతోందనే చర్చ జరుగుతోంది. టీడీపీతో పొత్తుకు సై అంటున్న జనసేన.. బీజేపీని కూడా కలుపుకోవాలని భావిస్తోంది. ఐతే సోము మినహా.. బీజేపీలో దాదాపు మెజారిటీ సభ్యులు పొత్తుగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సోము వీర్రాజు పదవి ఊడడంతో… పొత్తుకు రూట్ క్లియర్ అయినట్లేనా.. 2014 సమీకరణాలు మళ్లీ చూస్తామా అనే చర్చ జరుగుతోంది. ఏమైనా ఏపీ బీజేపీలో ఏదో కీలక మలుపు చోటుచేసుకోవడం ఖాయం అనిపిస్తోంది.