మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ గెలవాలన్న ఆశలు భారత్ కు ఈ సారి కూడా నెరవేరలేదు. భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడిన టీమిండియా, తప్పక గెలవాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. పాకిస్థాన్ , శ్రీలంక జట్లపై గెలిచినా న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయాలతో మన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. . భారత మహిళా జట్టు ఇప్పటివరకూ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది. మహిళల జట్టుకు గతంతో పోలిస్తే ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి. పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజును అందిస్తున్న బీసీసీఐ వారి కోసం మహిళల ఐపీఎల్ నూ ప్రారంభించింది. కానీ ఐసీసీ టైటిల్ కల మాత్రం ఇప్పటికీ నెరవేరడం లేదు.
అయితే ప్రస్తుత టీ ట్వంటీ వరల్డ్ కప్ లో వైఫల్యంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. కెప్టెన్ ను మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన భారత కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్, 150కి పైగా పరుగులు చేసి… టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా ఉంది.. అయితే మిగిలిన బ్యాటర్ల నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాకపోవడంతో భారత జట్టు గ్రూప్ స్టేజీ నుంచి ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. అదే సమయంలో ఆసీస్ తో మ్యాచ్ చివర్లో హర్మన్ దూకుడుగా ఆడలేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా చివరి ఓవర్లో విజయం కోసం తాను స్ట్రైకింగ్ తీసుకోకుండా ఉండడంపైనా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో కెప్టెన్ గా కీలక ఇన్నింగ్స్ లు ఆడినా కీలక మ్యాచ్ లో ఆమె దూకుడుగా బ్యాటింగ్ చేయకపోవడంతోనే ఓడిపోయిందన్న వాదనా ఉంది.
ఈ నేపథ్యంలో హర్మన్ ప్రీత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి మరో ప్లేయర్ గా పగ్గాలు అందించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టును సిద్ధం చేయాలని సూచించింది. కెప్టెన్‌ను మార్చాలనుకుంటే, ఇప్పుడే కొత్త సారథిని నియమించాలని, ఆలస్యం చేస్తే మరో కప్‌కు దూరమవుతామని అభిప్రాయపడింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అందుబాటులో ఉన్నప్పటికీ జెమీమా రోడ్రిగ్స్‌కు కెప్టెన్సీ అప్పగించాలని మిథాలీ వ్యాఖ్యానించింది. 24 ఏళ్ల జెమీమా ఎక్కువ కాలం సారథిగా కొనసాగడానికి అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చిది. ఇక మెన్స్ టీమ్ లో రిజర్వ్ బెంచ్ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లుగా మహిళల జట్టులో కూడా చేయాలని సూచించింది.