నిత్యం ఏదోక రూపంలో వార్తల్లో నిలిచే మంచు ఫ్యామిలీ ఇప్పుడు తమ విశ్వ విద్యాలయం విషయంలో మరోసారి మీడియాలో నానుతోంది. యూనివర్సిటీలో జరుగుతున్న కొన్ని అక్రమాలు ఇప్పుడు బయటకు రావడం సంచలనం అయింది. ఇది క్రమంగా కుటుంబ వివాదంగా మారింది. మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ గా వివాదం మారుతోంది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలయింది ఏంటీ అనేది చూద్దాం. నటుడు మోహన్ బాబు కుటుంబంలో విద్యాసంస్థల వివాదం వెనుక మంచు విష్ణు చేసిన ఓ తప్పు ఉందనే కామెంట్స్ వినపడుతున్నాయి.
2022 లో మోహన్ బాబు యూనివర్సిటీగా శ్రీ విద్యానికేత్ విద్యాసంస్థలు ఆవిర్భవించాయి. స్కూలింగ్ నుంచి పీ హెచ్ డీ, ఇంజనీరింగ్, పారా మెడికల్ కాలేజీల్లో 13 వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. యూనివర్సిటీ చాన్సలర్ గా మోహన్ బాబు, ప్రో ఛాన్సలర్ గా మంచు విష్ణు ఉన్నారు. యూనివర్సిటీ కాక ముందు విద్యాసంస్థలకు చైర్మన్ గా మోహన్ బాబు ఉండగా… సీఈఓగా మంచు విష్ణు ఉన్నారు. గత రెండేళ్లుగా విద్యాసంస్థల వ్యవహారం వివాదాస్పదం అయింది. 49 శాతం వాటా డిల్లీకి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరికి విష్ణు అప్పగించారు.
చీఫ్ గ్రోత్ ఆఫీసర్ వికాస్ సింగ్ కు యూనివర్సిటీ పెత్తనం ఇచ్చారు. యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజులు బిల్డింగ్ ఫీజులు పేరుతో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ కమిటీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ నెల 10న మంత్రి నారా లోకేష్ కు పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసింది. యూనివర్సిటీ యంత్రాంగం తీరుపై AICTE కి కూడా ఫిర్యాదు చేసారు. పలు ఫిర్యాదులు మేరకు AICTE అధికారులు స్పందించారు. అక్కడి నుంచి కథ కొత్త మలుపులు తిరిగింది. ఇది అక్కడి నుంచి కుటుంబ వివాదంగా మారింది.
ఇక యూనివర్సిటీలో ఫీజులపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళన పై స్పందించిన హీరో మనోజ్…. మోహన్ బాబు దృష్టికి సమస్యలను తీసుకెళ్తాను అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసారు. ఇప్పుడు ఈ వివాదానికి ప్రధాన కారణం మంచు విష్ణు చేసిన తప్పే అంటున్నారు పలువురు. వికాస్ సింగ్ కు బాధ్యతలు వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో విద్య కూడా సరిగా లేదని దానికి తోడు బ్రాండ్ చూపించి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఫీజులకు చెప్పే విద్యకు సంబంధం లేదని ఇలాగే జరిగితే విద్యా సంస్థల మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.