KTR: నిజామాబాద్ ఆర్మూర్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రమాదం జరిగింది. ప్రచార రథం రెయిలింగ్ విరగడంతో.. మంత్రి కేటీఆర్‌తో సహా వ్యాన్ మీద ఉన్న నేతలంతా కిందపడిపోయారు. ఆర్మూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు మంత్రి కేటీఆర్ ఆర్మూర్‌కు వెళ్లారు. జీవన్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయల్దేరారు. మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి, స్థానిక బీఆర్‌ఎస్ నేతలు ప్రచార వ్యాన్ ఎక్కారు. కానీ ఆ వ్యాన్ రెయిలింగ్ చాలా వీక్‌గా ఉంది.
అంతమందిని తట్టకునే కెపాసిటీ రెయిలింగ్‌కు లేదు. ఈ విషయాన్ని నేతలు ముందుగా గుర్తించలేదు. అప్పటి వరకూ అంతా బాగానే ఉంది. స్థానిక నేతలకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేటీఆర్ వ్యాన్ మీద నిల్చున్నారు. ముందున్న కార్ బ్రేక్ వేయడంతో వ్యాన్ డ్రైవర్ కూడా సడెన్ బ్రేక్ వేశాడు. అంతమంది వెయిట్ ఒకేసారి రెయిలింగ్ మీద పడటంతో ఒక్కసారిగా రెయిలింగ్ విరిగిపోయింది. మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి, మిగిలిన బీఆర్‌ఎస్ నేతలు అంతా ఒక్కసారిగా వ్యాన్ మీద నుంచి పడిపోయారు. వ్యాన్ స్పీడ్ ఎక్కువగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కేటీఆర్‌తో సహా నేతలెవరికీ పెద్దగా దెబ్బలు తగలలేదు. ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో అప్పటి వరకూ మంచి జోష్‌లో ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు డీలా పడిపోయారు. తరువాత వేరే కార్‌లో వెళ్లి నామినేషన్ వేశారు జీవన్ రెడ్డి.
అటు నుంచి నేరుగా కొడంగల్ ప్రచారానికి వెళ్లిపోయారు కేటీఆర్. ట్విటర్‌లో ఈ ప్రమాదంపై స్పందించారు. అనుకోకుండా చిన్న ప్రమాదం జరిగిందని.. తనకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని.. ప్రచారం బాగా నిర్వహించాలంటూ పోస్ట్ చేశారు. నామినేషన్ రోజే ఇలాంటి ప్రమాదం జరగడంతో ఆర్మూర్ బీఆర్‌ఎస్ నేతల్లో జోష్ తగ్గింది.