39మంది ఎమ్మెల్యేలతో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది బీఆర్‌ఎస్ (BRS). ఇక రాజకీయంగా అధికార, విపక్ష పార్టీల (Opposition parties) మధ్య వివిధ అంశాలపై మాటల తూటాలు పేలుతున్నాయ్. 2014, 18 అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) ముగిశాక.. కొద్దిరోజులకు నాటి కాంగ్రెస్ (Congress ) ఎమ్మెల్యేలు కొందరు కారెక్కారు. పక్క పార్టీ తరఫున ఎన్నికైన వారిని.. బీఆర్‌ఎస్ చేర్చుకోవడంపై అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. ఇప్పుడు పరిస్థితులు మారాయ్. కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్‌ఎస్ విపక్షానికి పరిమితం అయింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూస్తుంటే.. పాత్రలు మారి పాత దృశ్యాలు కొత్తగా కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నాయ్ రాజకీయ వర్గాలు. దీనిపై ఇప్పటికే విస్తృత చర్చ మొదలైంది.
ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలు పార్టీలు మారే అవకాశం లేకున్నా.. సమీప భవిష్యత్‌లో ఆ అవకాశాలను కొట్టిపారేయలేమన్నది పరిశీలకుల మాట. ఇలాంటి చర్చ పెరుగుతున్న సమయంలోనే ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగింది. దాని గురించే హాటు ఘాటుగా మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజవర్గాలు ఉన్నాయ్. ఇటీవలి ఎన్నికల్లో 12 స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్. జిల్లా నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు గెలిచారు. గద్వాల్, అలంపూర్‌లో మాత్రమే గులాబీ జెండా ఎగిరింది. అయితే ఇటీవల గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్.. మంత్రి జూపల్లి కృష్ణారావు ( Jupalli Krishna Rao) ఛాంబర్‌లో కనిపించారట.
ఒకవైపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు విమర్శలు గుప్పించుకుంటున్న టైంలో.. కృష్ణమోహన్‌రెడ్డి సచివాలయంలోని జూపల్లి కార్యాలయంలో కనిపించడం ఇప్పుడు హాట్ హాట్ చర్చకు దారి తీసింది. ఈ కలయిక పూర్వాపరాలపై ఆరా తీస్తున్నాయట రాజకీయ వర్గాలు. ఎందుకు వెళ్లి ఉంటారు.. కారణం ఏమై ఉంటుందన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నారట కొందరు. అయితే అటు నుంచి మాత్రం.. ఈ పరిణామాలకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్న సమాధానం వస్తున్నట్టు తెలిసింది. అయినా నమ్మకం కుదరక.. ఏదో జరుగుతోందన్న అనుమానపు చూపులే వెంటాడుతున్నాయట ఎమ్మెల్యేని.
ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయాలకు (Politics) అతీతంగా స్నేహం ఉందని.. అంతకుమించి ఆలోచించడానికేం లేదని సన్నిహితులు అంటున్నా.. మేం నమ్మం అనే వాళ్లే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. తాను పార్టీ మారతానన్న ప్రచారాన్ని ఇటీవల ఖండించారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. కానీ.. రాజకీయాలు కదా.. ఎప్పుడు ఏమైనా జరగవచ్చన్న చర్చ మాత్రం గట్టిగానే జరుగుతోంది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య స్నేహం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు.