వరల్డ్ క్రికెట్ లో రికార్డుల ఎవరెస్ట్ గా పేరున్న సచిన్ టెండూల్కర్ ను దాటేస్తూ సరికొత్త శకానికి తెరతీసింది ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీనే… అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనూ టన్నుల కొద్దీ పరుగులు, వందల కొద్దీ రికార్డులు కొట్టేస్తూ రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. అతను క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు విరాట పర్వమే… అలాంటి కోహ్లీ బ్యాట్ కొన్నాళ్ళుగా సైలెంట్ అయిపోయింది. విరాట్ బ్యాట్ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ చూసి దాదాపు ఏడాది పూర్తయిపోతోంది. మధ్యలో కుటుంబంతో గడిపేందుకు బ్రేక్ తీసుకున్నాడని అనుకున్నా.. ఓవరాల్ గా మునుపటి కసి, దూకుడు విరాట్ లో కనిపించడం లేదన్నది చాలా మంది చెబుతున్న మాట.. గణాంకాల్లోనూ ఇది స్పష్టంగా తెలిసిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2024 కోహ్లీ కెరీర్ లోనే వరస్ట్ ఇయర్ గా నిలిచిపోయింది. యావరేజ్ పరంగా విరాట్ కెరీర్ లో అత్యంత దారుణమైనదిగా మిగిలింది.
2008లో కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ మొదలవగా… అక్కడ నుంచి తిరుగులేని ఆధిపత్యం కొనసాగించిన ఈ రన్ మెషీన్ ఎప్పటికప్పుడు రికార్డులు కొల్లగొడుతూనే ఉన్నాడు. 2016లో అతని యావరేజ్ 86.5 గా నమోదైంది. అతని కెరీర్ లో ఒక ఏడాదిలో ఇదే బెస్ట్ యావరేజ్… తర్వాత వరుసగా మూడేళ్ళ పాటు విరాట్ డామినేషన్ కొనసాగింది. అయితే 2020 నుంచి మళ్ళీ యావరేజ్ 36కు పడిపోగా… 2023లో మునుపటి కోహ్లీని ఫ్యాన్స్ కు చూపించాడు. కానీ ఏడాదిలోనే ఈ ఫామ్ కూడా కోల్పోయి సతమతమవుతున్నాడు. యావరేజ్ పరంగా 2024 కోహ్లీ కెరీర్ లో వరస్ట్ అని చెప్పొచ్చు. ఈ ఏడాది కోహ్లీ కేవలం 19.72 సగటుతో ఉన్నాడు. ఈ నెలలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరో నాలుగు టెస్టులు మిగిలుండగా…కోహ్లీ ఎంత బాగా ఆడినా యావరేజ్ 30 దాటకపోవచ్చు.
అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమిస్తాడని చాలా మంది అనుకున్నారు. ప్రస్తుతం అతని ఫామ్ చూస్తే మాత్రం ఈ మైలురాయి అందడం కష్టంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో మన రన్ మెషీన్ బాగా వెనుకబడిపోయాడు. ఒకవైపు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ పరుగుల వరద పారిస్తుంటే కోహ్లీ మాత్రం 29వ శతకం దగ్గరే ఆగిపోయాడు. 2020 నుంచీ టెస్టుల్లో అతని పరుగుల సగటు తగ్గుతూ వస్తోంది. 2023 తప్పిస్తే మిగిలిన ఏడాదుల్లో సగటు కోహ్లీ స్థఆయికి తగినట్టు లేదు. ఇటీవల స్వదేశంలో కివీస్ తో సిరీస్ లోనూ విరాట్ అట్టర్ ఫ్లాపయ్యాడు. అత్యుత్తమ ఆటగాళ్ళకు కూడా ఒక్కోసారి గడ్డుకాలం ఉంటుందని కొందరు మాజీలు చెబుతున్నా ఈ సారి ఆస్ట్రేలియా సిరీస్ కోహ్లీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అసలు ఆసీస్ గడ్డపై విరాట్ కు తిరుగులేని రికార్డుంది. అక్కడి పేస్ పిచ్ లపై అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ మరోసారి వాటిని రిపీట్ చేస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.