ఏ ఇండస్ట్రీలోనైనా ఎదగలాంటే తక్కువ మాట్లాడాలి.. ఎక్కువ పని చేయాలి. రాకేశ్ మాస్టర్‌కి రెండు ఎక్కువే.. పని కోసం ప్రాణమిస్తాడు.. ఆ పనికి అడ్డమోస్తే నోటికి వచ్చింది తిడతాడు..అవతల వాళ్లు ఎవరైనా రాకేశ్ మాస్టర్ ముందు ఒక్కటే..! ఆ ముక్కుసూటి తనమే రాకేశ్ మాస్టర్ కొంపముంచింది. తన కెరీర్ పతనానికి ముఖ్య కారణమైంది. అదేంటి ముఖంపై ఉన్నది ఉన్నట్టు చెబితే కెరీర్ పోతుందా అంటే..వేరే రంగాల్లో తెలియదు కానీ.. సినీ ఇండస్ట్రీలో మాత్రం కచ్చితంగా పోతుంది. అక్కడ భజన చేసేవాళ్లకే లైఫ్ ఉంటుంది. స్టేజీపై హీరోని దేవుడు అనాలి. అందరికంటే నేనే పెద్ద భక్తుడిని అని చెప్పుకోవాలి. లేకపోతే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లను ఆకాశానికి ఎత్తాలి.. ఇవ్వని తెలియకపోతే ఇండస్ట్రీలో ఎదగడం కష్టమే..! అలా చేయకుండా పైకి వచ్చినవాళ్లు కొంతమంది ఉన్న మాట వాస్తవమే అయినా..వాళ్లంతా పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకుపోయారు.. రాకేశ్ మాస్టర్‌కి అతి చేత కాలేదు..అందుకే ఇండస్ట్రీలో ఇమడలేకపోయాడు..!
రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. తిరుపతిలో 1968లో జన్మించారు. చిన్నతనం నుంచి రాకేశ్ మాస్టర్‌కి డ్యాన్స్ అంటే పిచ్చి. సినిమాలు అంటే ప్రాణం. చిన్నతనంలోనే రాకేశ్‌లోని టాలెంట్‌ని గుర్తించిన తల్లిదండ్రులు ఇండస్ట్రీ వైపు ప్రొత్సహించారు. ఆ ప్రయత్నంలోనే చెన్నైకి వెళ్లిన రాకేశ్ మాస్టర్ అక్కడ భరతనాట్యం నేర్చుకొని తిరుపతిలో డాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాడు. చాలా మంచి గుర్తింపు వచ్చింది. అది చూసి ఓర్వలేకపోయిన కొందరు అప్పట్లోనే రాకేశ్ మాస్టర్‌ని చంపుతామని బెదిరించారు. దీంతో ఆయన హైదరాబాద్ వచ్చేసి డాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ కూడా సినీ సర్కిల్‌లో చాలా పాపులర్ అయ్యాడు. అప్పుడే హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న ప్రభాస్, వేణు తొట్టెంపూడి రాకేష్ మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకున్నారు. అప్పటికే పలు సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేశ్ మాస్టర్ తన కెరీర్‌లో 1,500లకు పైగా సినిమాలకు పని చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్లగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వారికి రాకేష్ మాస్టరే గురువు. అలాంటి రాకేశ్ మాస్టర్ కేవలం మీమ్ మెటీరియల్‌గా మారిపోయాడు. ట్రోలర్స్‌కు ఐటెమ్‌లాగా మారిపోయాడు..!
ఇండస్ట్రీలో అవకాశాలు పెరుగుతున్న సమయంలో రాకేశ్ మాస్టర్ తన ముక్కుసూటితనాన్ని తగ్గించుకోలేకపోయాడు.. దాని కారణంగా ఇండస్ట్రీలోని పెద్దలతో ఇష్యూస్ వచ్చాయి. నోటి దురుసు కూడా ఎక్కువ ఉండడంతో డ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఆయన్ను బహిష్కరించారు. ఆ తర్వాత చాలా కాలం పాటు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చిన రాకేశ్ మాస్టర్ మీమ్ మెటీరియల్‌గా మారిపోయాడు. ఇండస్ట్రీలోని పెద్దలపై ఆయన చేసిన కాంట్రవర్శీ డైలాగులు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన మాట్లాడిన బూతులు నెగిటివ్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. అటు హేతుబద్దంగా రాకేశ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్దగా పాపులారిటీని సంపాదించుకోలేకపోయాయి.. ఎందుకంటే జనాలకు కావాల్సింది కాంట్రవర్శీలే కదా..! తనకు ఎంతో ఇష్టమైన తమ్ముడు, అమ్మ చనిపోయిన తర్వాత మానసికంగా ఎందో కుంగిపోయిన రాకేశ్ మాస్టర్ తనకు జీవితంపై ఎప్పుడో విరక్తి కలిగేసిందని ఎన్నోసార్లు చెప్పుకున్నాడు.. చావు ఎప్పుడొచ్చినా భయపడనని, చావంటే లేక్కే లేదన్న రాకేశ్ మాస్టర్ మాటలు ఆయన మైండ్‌సెట్‌ని క్లియర్ కట్‌గా చూపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఉండే పెద్దల మనస్తత్వాలు, అక్కడ బతకగలిగే లౌక్యం తెలియక కెరీర్‌లో ఎన్నో అవకాశాలను కోల్పోయిన రాకేశ్ మాస్టర్ జీవితం తోటి ఆర్టిస్ట్‌లకు ఓ పాఠంగా మిగిలిపోతుందన్నది అక్షర సత్యం..!