Chandrababu: ఏసీబీ కోర్ట్ చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ పొడిగించడం వెనుక ఆంతర్యం ఏమిటి..?

చంద్రబాబు కేసులో చాలా మెలికలు ఉన్నాయి. ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు లింకులు ఉన్నాయి. దీంతో కేసు పురోగతిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది టీడీపీ వర్గం వారికి నిరాశ కల్గించవచ్చు. అయితే కోర్టు విధివిధానాలు ఎలా ఉంటాయి. కేసు పురోగతి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 12:02 PM IST

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి నేటికి 28 రోజులు అయింది. అంటే ఇంచుమించు నెలరోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో గడుపుతున్నారు. గతంలో రెండు రోజులు సీఐడీ విచారణ కూడా చేసింది. అయితే విషయాన్ని రాబట్టడంలో ఎలాంటి పురోగతి సాధించలేక పోయారు సీఐడీ అధికారులు. చంద్రబాబు విచారణకు సహకరించడంలేదని కోర్టుకు తెలిపారు. అలాగే మరోసారి సీఐడీ కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు. దీనికి కౌంటర్ గా చంద్రబాబు తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ రెండింటికి మధ్య గురువారం తీవ్రంగా వాదోపవాదాలు జరిగాయి. ఈక్రమంలో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. దీంతోపాటూ మరో 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది.

ఇన్ని రోజులు రిమాండ్ ఎందుకు..

ప్రస్తుతం చంద్రబాబు కేసు కేవలం ఏసీబీ కోర్టులోనే కాకుండా అటు హై కోర్ట్ లో వాదనలు, సుప్రీం కోర్టుల్లోనూ మెన్షనింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ ముందస్తు బెయిల్ పిటిషన్లే కావడం గమనార్హం. పైగా ఏసీబీ కోర్టులో పీటీ యాక్ట్ కింద సీఐడీ కొన్ని పిటిషన్లు దాఖలు చేసింది. అంటే ఏసీబీ కోర్టు విచారణ నుంచి తప్పుకోవడానికి హై కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు చంద్రబాబు లాయర్లు. దీంతో పాటూ అంగళ్లు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు పై కూడా విచారణ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఎట్నుంచి చూసినా ఏసీబీ కోర్టుకు లింకు లేకుండా పోలేదు. ఎందుకంటే ప్రత్యేక కోర్టులు పై కోర్టుల తీర్పులను అనుసరించి తమ విధులను నిర్వర్తిస్తాయి. దీనికి ఉదాహరణగా ఒక్క అంశాన్ని పరిశీలించాలి. ఒక్క రోజు విచారణకు వాయిదా ఇచ్చి 14 రోజుల రిమాండ్ గడువు ఎందుకు పొడిగిస్తారు అన్న అనుమానాలు ఉన్నాయి. అంతగా బెయిల్ పై సానుకూలంగా ఉంటే గతంలో లాగా రెండు రోజుల కస్టడీ ఇచ్చి నేడు వాదనల్లో బెయిల్ తీర్పు ఇవ్వచ్చు. ఈ అవకాశాన్ని పక్కన పెట్టి రిమాండ్ గడువు పెంచడం వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హై కోర్టు కొట్టివేయడంతో ఎందుకు కొట్టేసిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. పైగా దీనిని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో అక్టోబర్ 9కి వాయిదా పడింది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రిమాండ్ 14 రోజులు పొడిగించినట్లు తెలుస్తోంది.

బెయిల్, కస్టడీ పై నేడు వాయిదా తప్పదా..?

ఏసీబీ కోర్టులో గురువారం నాడు కొంత గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో కస్టడీ, బెయిల్ పిటిషన్ ను శుక్రవారానికి వాయిదా వేశారు జడ్జి. ఈరోజు వాదనలు ప్రశాంతంగా ముగిస్తే తీర్పును రిజర్వ్ చేసే అవకాశం ఉందంటున్నారు న్యాయనిపుణులు. పైగా రేపటి నుంచి శని,ఆదివారాలు కావడంతో కోర్టుకు సెలవులు. దీంతో రిజర్వ్ చేసిన తీర్పు సోమవారం వెలువడే అవకాశం ఉంటుంది. అది కూడా వాదనలు సాఫీగా సాగితేనే. ఇలా కాకుండా జడ్డి తీరికను బట్టి, కోర్టు సమయానుగుణంగా కూడా తీర్పును వాయిదా వేసే అవకాశం ఉంటుంది. అంటే ఈరోజు బెయిల్, కస్టడీ పై ఎలాంటి స్పష్టమైన తీర్పు వెలువడే అవకాశం లేదంటున్నారు సీనియర్ న్యాయవాదులు. ఈలోపూ సుప్రీం కోర్టులోని క్వాష్ పిటీషన్ పై వచ్చే సమాచారం ఆధారంగా కూడా తీర్పును వెలువరించడంలో జాప్యం చేయవచ్చు. అంటే ఈరోజు బెయిల్ రాకపోగా ఈ రెండు, మూడు రోజులు చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగించే అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. సుప్రీం కోర్టులో 9 న వాయిదా పడిన తరుణంలో, 10 న ఆడిటర్ విచారణకు వస్తారన్న నేపథ్యంలో ఈ కీలక అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నందున బెయల్ రావడం కష్టమే అంటున్నారు న్యాయశాస్త్ర పండితులు. దీంతో వాయిదాల పర్వ కొనసాగవచ్చు, బెయిల్ పిటిషన్ తోసి పుచ్చవచ్చు.

బెయిల్ రాకపోవడానికి కారణాలు ఏంటి..?

చంద్రబాబుకు సంబంధించి ఇప్పటికే పలు కోర్టుల్లో రకరకాల కేసులు వాదనలు కొనసాగుతున్నాయి. పైగా సుప్రీం కోర్టులో గత వారమే మెన్షనింగ్ కి వచ్చింది కేసు. మెన్షనింగ్ తరువాత ఇయరింగ్ కి రావాలి. ఇయరింగ్ రావడానికి గత కోర్టులు ఇచ్చిన తీర్పులను చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే హై కోర్టు కొట్టివేసిన క్వాష్ పిటీషన్ దస్త్రాలను కోరింది సుప్రీంకోర్టు. వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున మరో సారి వాయిదా పడే అవకాశం ఉంటుంది. అంటే సోమవారం సుప్రీంలోనూ ఎలాంటి స్ఫష్టమైన తీర్పు రాకపోవచ్చనే అభిప్రాయం చాల మందిలో ఉంది. ఇక ఏపీ హైకోర్టు విష‍ంలోనూ అనేక కుంభకోణాలపై సుదీర్ఘంగా వాదనలు వినిపిస్తున్నారు అటు ప్రభుత్వం, చంద్రబాబు తరఫు న్యాయవాదులు. ఇలాంటి తరుణంలో బెయిల్ ఇచ్చే ముందు స్పెషల్ కోర్టులు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. పై కోర్టుల్లో కేసు తీవ్రతను, పరిస్థితిని చూసి బెయిల్ మంజూరు చేస్తాయి. అందుకే హై కోర్టు, సుప్రీం కోర్టుల్లో జరిగే కేసు పూర్వోపరాలు పరిశీలించిన తరువాతే ఏసీబీ కోర్టు తన తీర్పును వెలువరించనున్నట్లు పరిస్థితులు చూస్తే అర్థమౌతోంది. దీనికోసమే మరో 14 రోజులు రిమాండ్ పొడిగించినట్లు అంచనా వేయవచ్చు.

T.V.SRIKAR