Jack Ma: ఆ 23 గంటలు.. జాక్‌మా పాకిస్థాన్‌లో ఏం చేశారు ? చైనాకు తెలియకుండా ఎందుకు వెళ్ళారు ?

జాక్‌మా.. ప్రపంచకుబేరుడు.. చైనా సంపన్నుల జాబితాలో ఆయనది నాలుగో స్థానం. అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడిగా, చైనీస్ బిజినెస్ మ్యాగనైట్‌గా ఆయన ప్రపంచానికి సుపరిచితుడు. మల్టీ నేషనల్ కంపెనీ అధినేతగా ఆయన వివిధ దేశాల పర్యటనలకు వెళ్తూ ఉంటారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే కొన్ని రోజుల ముందు జాక్‌మా ఊహించని విధంగా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లారు. అది కూడా మూడో కంటికి తెలియకుండా.

  • Written By:
  • Publish Date - July 4, 2023 / 02:07 PM IST

సాధారణంగా ఇలాంటి బిలియనీర్లు ఏ దేశానికి వెళ్లినా ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ స్వాగతాలు పలుకుతాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో అనేక కథనాలు వస్తాయి. ప్రభుత్వ పెద్దలతో చర్చల నుంచి పెట్టుబడి సదస్సుల వరకు పెద్ద లైన్‌అప్ ఉంటుంది. అయితే జాక్‌మా పర్యటనలో ఇవేమీ కనిపించలేదు. ఆయన పాకిస్థాన్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి ఫైట్ చైనాకు టేకా‌ఫ్ అయ్యే వరకు టూర్ ‌మొత్తం సీక్రెట్‌గా సాగిపోయింది. రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లారు అన్నది బిజినెస్ వర్గాలకు అంతుపట్టడం లేదు.

ఆ 23 గంటల్లో జాక్‌మా ఏం చేశారు ?

బిజినెస్‌ ట్రిప్‌లో భాగంగా నేపాల్‌లో పర్యటించిన జాక్‌మా..ఖాట్మండ్ ‌నుంచి నేరుగా లాహోర్ వెళ్ళారు. ప్రైవేటు ప్రాంతంలో 23 గంటల పాటు ఆయన ఉన్నట్టు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక చెబుతోంది. ఆ 23 గంటల్లో జాక్‌మా ఎవరెవర్ని కలిశారు ? ఎలాంటి విషయాలు చర్చించారు ? అన్నది ఇప్పటి వరకు బయటకు ఎవరికీ తెలియదు. జాక్‌మా రహస్యంగా అన్ని గంటల పాటు లాహోర్‌లో ఏం చేశారన్నది మిస్టరీగా మారింది. చైనాకు చెందిన మల్టీ బిలయనీర్, అది కూడా ఇటీవల చైనా ప్రభుత్వ ఆగ్రహానికి గురైన వ్యక్తి.. ఒక్కసారిగా లాహోర్ ఎందుకొచ్చారన్నది మిలయన్ డాలర్ల ప్రశ్నగా మారింది. జాక్ మా లాహోర్ టూర్ ఎంత సీక్రెట్‌గా జరిగిందంటే.. పాకిస్థాన్‌లో ఉన్న చైనా ఎంబసీకి కూడా కనీస సమాచారం లేదు. సాధారంగా హై ప్రొఫైల్ వ్యక్తుల పర్యటనలు ఉన్నప్పుడు.. ఆయా దేశాల్లో ఉన్న విదేశీ ఎంబసీలకు కచ్చితంగా తెలుస్తుంది. పబ్లిక్, ప్రైవేట్ ఎలాంటి పర్యటనైనా.. సమాచారం లేకుండా ఉండదు. కానీ జాక్ ‌మా మాత్రం సొంత దేశం చైనాకు కూడా తెలియకుండా పాక్‌లో పర్యటించడం ఆసక్తిగా మారింది.

వ్యక్తిగత పర్యటనైతే వాళ్లతో ఉన్నవారెవరు ?

రహస్య పర్యటన కోసం జాక్‌మా ఒక్కరే పాకిస్థాన్‌లో అడుగుపెట్టలేదు. ఆయనతో పాటు ఎడుగురు వ్యక్తులు ఉన్నారు. ఐదుగురు చైనావాళ్లు, ఒక డానిష్ దేశస్తుడు, ఒక అమెరికన్..జాక్‌మాతో ఉన్నారు. వాళ్లంతో కలిసి జాక్ మా లాహోర్‌లో ఏం చేశారన్నది బయట ప్రపంచానికి తెలయడం లేదు. పూర్తిగా వ్యక్తిగత పర్యటనకు వచ్చి ఉంటే.. ఇలా ఏడుగురు డెలిగేషన్‌తో ఎందుకొచ్చారన్నది అసలు ప్రశ్న.

జాక్‌మాను చైనా గెంటేస్తుందా ?

ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్న జాక్‌మా ఏరకంగా చూసుకున్న చైనాకు ఆస్తి. అలీబాబా సహ వ్యవస్థాపకుడిగా చైనాలో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే నడుపుతున్నారు. అయితే చైనా కమ్యూనిస్టు పాలకులకు సలాం కొట్టినంత కాలం మాత్రమే ఆ దేశంలో ఎవరికైనా మనుగడ ఉంటుంది. ప్రభుత్వాన్ని గానీ, పార్టీని గానీ, ప్రభుత్వ విధానాలను కూడా ప్రశ్నించడం మొదలు పెడితే డ్రాగన్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. జాక్‌మాకు కూడా కొంతకాలంగా ఇదే అనుభవం ఎదురవుతుంది. చైనా బ్యాంకులను, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంతో ఆయనకు వేధింపులు మొదలయ్యాయి. జాక్‌మాపై నిఘా పెరిగింది. ఆయన సంస్థకే చెందిన యాంట్ గ్రూప్ ఐపీఓ కూడా రద్దయ్యింది. చైనా ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో జాక్‌మా ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2020 అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆతర్వాత అడపాదడపా జనానికి కన్పిస్తున్నారు.

చైనా పాలకుల ఆలోచనలకు..జాక్‌మా వ్యాపార విధానాలకు ఎప్పుడో గ్యాప్ వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేయడం మానుకున్న జాక్‌మా తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే సొంతదేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి.. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తన వంతు ప్రయత్నం చేస్తున్న బిజినెస్‌ టైకూన్‌కు ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోతే.. అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. బహుశా జాక్‌మా కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారన్న భావన చాలా మందిలో ఉంది. చైనా మీద ఆధారపడటం కంటే.. తమకు అనుకూలంగా ఉన్న దేశాల్లో వ్యాపారాలను విస్తరించడంపై జాక్‌మా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే జాక్‌మా రహస్యంగా పాకిస్థాన్‌లో పర్యటించారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే పాక్ – చైనా ప్రభుత్వాలది విడదీయరాని బంధం. మన దేశంతో ఉన్న శతృత్వం కారణంగా పాకిస్థాన్‌ అన్ని రకాలుగా అండగా ఉంటోంది. వేల కోట్లతో ఎన్నో ప్రాజెక్టులను చేపట్టింది.

పాక్ దివాళా తీయడానికి సిద్ధంగా ఉన్న ప్రతిసారీ పాక్‌కు మిలియన్ డాలర్ల అప్పులు ఇచ్చి ఆదుకుంటోంది. ఇలాంటి సమయంలో పాక్ పాలకల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న జాక్‌మా తమ దేశం నెత్తిన పెట్టుకున్న చైనాలో వ్యాపారాలు చేస్తారా లేక.. ఇంకేమైనా రహస్య ఎంజెడా ఉన్నదా అన్నది తేలాల్సిన అంశం. అయితే ఆర్థికంగా చితికిపోయిన పాక్ ఆర్థిక వ్యవస్థకు… జాక్‌మా రూపంలో ఏదైనా మేలు జరగొచ్చని పాకిస్థాన్ కొండంత ఆశతో ఉంది.