చంద్రబాబు అరెస్టు తర్వాత అందరూ స్పందించారు. కానీ నందమూరి ఫ్యామిలీకి చెందిన ఓ సూపర్ స్టార్ మాత్రం నోరు విప్పలేదు. ఆయనే జూనియర్ ఎన్టీఆర్. బాబుకు సపోర్ట్ గా ఆయన కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడంపై సర్వత్రా వాడివేడి చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే కాదు. హరికృష్ణ ఫ్యామిలీకి చెందిన ఏ ఒక్కరూ చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడేందుకు ముందుకు రాలేదు. వీరికి కోపం ఉన్నది ఎవరిపై ? చంద్రబాబుపైనా ? టీడీపీపైనా ? అనే దానిపై రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. వాస్తవానికి నారా లోకేష్ కుప్పంలో యువగళం పాదయాత్రను ప్రారంభించినప్పుడు, తారకరత్న గుండెపోటుకు గురై బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు కూడా కుటుంబ సభ్యులతో జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. కల్యాణ్ రామ్‌తో కలిసి బెంగళూరుకు వచ్చి మరీ కుటుంబానికి అండగా నిలబడ్డారు. అలా ఎదుటివారికి అండగా నిలిచే గొప్ప మనస్తత్వం కలిగిన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ? అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టీడీపీపై నారా కుటుంబం పట్టును ఆయన వ్యతిరేకిస్తున్నారని కొందరు అంటుంటే.. నందమూరి ఫ్యామిలీలో అందరికీ టీడీపీలో సమ ప్రాతినిధ్యం దక్కాలనే ఒపీనియన్ తో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల ఎన్టీ రామారావు స్మారక నాణేన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్ కు రావాలని జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందింది. అయినా ఆయన వెళ్లలేదు. నారా కుటుంబంతో కలవడం ఇష్టం లేకపోవడం వల్లే ఢిల్లీకి వెళ్లలేదనే ప్రచారం జరిగింది. ఈ పరిణామాలన్నింటిని కలిపి చూసుకుంటే నందమూరి ఫ్యామిలీలో చీలిక వచ్చిందనే అనుమానాలు రేకెత్తుతున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హరికృష్ణ రెండో కొడుకు కళ్యాణ్‌రామ్ కూడా చంద్రబాబు అరెస్ట్ పై రియాక్ట్ కాలేదు.
జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో నందమూరి కుటుంబం నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు. సక్సెస్‌ఫుల్ హీరోగా రుజువు చేసుకున్న తర్వాత ఆయనను తమ కుటుంబ సభ్యుడిగా గుర్తించడం ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిని నిలువరించడానికి చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చింది. 2014లో చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చాక కేవలం లోకేష్‌ను ప్రమోట్ చేశారు. హరికృష్ణ ఫ్యామిలీ పూర్తిగా సైడ్‌లైన్ అయిపోయింది. బహుశా ఆ పాలనా కాలంలో చంద్రబాబు.. హరికృష్ణ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వకపోవడమే ఈ గ్యాప్ ఏర్పడటానికి దారితీసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతకుముందు 1995 ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబును హరికృష్ణ పూర్తిగా సపోర్ట్ చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక హరికృష్ణ కు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే టీడీపీలో తన స్థానం సుస్థిరం అయ్యాక హరికృష్ణ ప్రాధాన్యాన్ని బాబు బాగా తగ్గించారు. ఇక బాలకృష్ణ..చంద్రబాబు వియ్యంకుడు అయ్యాక, నారా కుటుంబానికి హరికృష్ణ అవసరం లేకుండాపోయింది. ఈ పరిణామాలన్నీ హరికృష్ణ కుటుంబానికి కోపం తెప్పించాయని తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు జైలులో ఉన్న ప్రస్తుత తరుణంలో టీడీపీని లోకేశ్, బాలయ్య నడిపిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మరెవరు కూడా అక్కడ కనిపించకపోవడం గమనార్హం.