BJP First List: బీసీలకు 36శాతం సీట్లు కేటాయించినా అసమ్మతి రాగం.. కిషన్, లక్ష్మణ్ పేర్లు తొలిజాబితాలో ఎందుకు లేవు..?

బీజేపీ తొలి జాబితాలో అధిక శాతం బీసీలకు కేటాయించినప్పటికీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. పైగా కిషన్, లక్ష్మణ్ పేర్లు తొలిజాబితాలో కనిపించలేదు. ఇక జనసేనతో పొత్తు దాదాపు ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందు ఇలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - October 23, 2023 / 09:43 AM IST

తెలంగాణలో బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో 52 మందికి అవకాశం కల్పించగా అందులో 19 సీట్లు బీసీలు, 19 ఓసీలు, 8 మంది ఎస్సీలు, 6 మంది ఎస్టీలు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు లక్షణ్ పేర్లు లేకపోవడం గమనార్హం. తమ పార్టీ బీసీలకు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెబుతూ లిస్ట్ విడుదల చేశారు. అయితే దీని గురించి టికెట్ ఆశించిన కొందరు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

బీసీల్లో అసమ్మతికి కారణం..

బీసీలకు అధిక స్థానాలు కేటాయించామని బీజేపీ చెబుతుంటే.. తమకు బలం లేని ప్రాంతాల్లో బీసీ అభ్యర్థులుగా ప్రకటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కొందరు నాయకులు. పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లోనే తమకు అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ పెద్దలు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో బీజేపీ ప్రభావం బాగా ఉందని సమాధానం ఇస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో బీసీలకు అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చార్మినార్, చాంద్రాయణ గుట్ట, యాకుత్ పురా, ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో మైనారిటీ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక్కడ బీసీలకు సీటు కేటాయించడాన్ని ఎలా చూడాలంటున్నారు.

రాష్ట్ర పెద్దలకు దక్కని చోటు..

ఇక సొంత పార్టీ నేతలకు ఇంకా ఎలాంటి నియోజక వర్గాలు కేటాయించలేదు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు అంబర్ పేట, ముషీరాబాద్ స్థానాల్లో నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తారా లేదా అన్న అనుమానం చాల మందిలో కలుగుతోంది. దీనికి బదులుగా కిషన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో తాను అంబర్ పేట నుంచి పోటీ చేయాలా వద్దా అనేది కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే తన భార్య కావ్యారెడ్డిని బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నారు. ఇక లక్ష్మణ్ కూడా తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని అధిష్టానానికి గతంలో చెప్పినట్లు సమాచారం. అందుకే ఆయన పోటీ చేయాలని తప్పుకున్న ముషీరాబాద్ నుంచి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, బండారు పవిత్రకు సీటు కేటాయించాలని భావిస్తోంది బీజేపీ. అందుకే ఈ ఇద్దరి పేర్లు తొలిజాబితాలో లేనట్లు స్పష్టమౌతోంది.

పవన్ తో పొత్తు సంగతేంటి..?

జనసేనతో దాదాపు పొత్తు ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీజేపీ ఇప్పటికే తన తొలి జాబితాను విడుదల చేసింది. రానున్న రోజుల్లో మరో ఒకటి లేదా రెండు జాబితాల్లో పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో జనసేన 12 సీట్లు కోరుతోందని, హైదరాబాద్ సిటీలో ఒకటి, చుట్టుపక్కల మరో రెండు స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే జనసేనకు తెలంగాణలో పెద్దగా బలం లేదని భావిస్తోంది బీజేపీ. అందుకే కోరుకున్న స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని యోచిస్తోంది. దీని కారణంగా జనసేనకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం. దీంతో దాదాపు పొత్తు ఉండదే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఇప్పటి వరకూ పవన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

T.V.SRIKAR