తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయ్. ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్… తన పట్టు కోల్పోతోంది. ఇదే కంటిన్యూ అయితే.. బీఆర్ఎస్ స్థానాన్ని త్వరలోనే బీజేపీ ఆక్రమించే చాన్స్ లేకపోలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 4స్థానాలకే పరిమితం కాగా.. ఈ ఎన్నికల్లో ఆ నంబర్ డబుల్ అయింది.
ఇదే ఇప్పుడు గులాబీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. బీఆర్ఎస్ పూర్తిగా సున్నాకు పరిమితం కావడం.. చాలా స్థానాల్లో మూడో స్థానంలో నిలవడం మరింత గుబులు రేపుతోంది. తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించిన బీజేపీ.. రాష్ట్రంలో క్రమంగా బలం పెంచుకుంటోంది. రాబోయే నాలుగేళ్లలో కమలం పార్టీ ఇదే హవా కంటిన్యూ చేస్తే.. ఆ ప్రభావం బీఆర్ఎస్ మీద పడే చాన్స్ ఉంది. 2028 ఎన్నికల్లో ఎలా అయినా సరే రాష్ట్రంలో చక్రం తిప్పేందుకు ఇప్పటి నుంచే బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కనీసం పోటీ కూడా ఇవ్వకపోవడం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర నేతలను కాకుండా… కేంద్రంలో పార్టీని దృష్టిలో పెట్టుకుని జనాలు ఓట్లు వేస్తారనే వాదన ఉంది. దీంతో రాష్ట్ర పార్టీ అయిన బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడానికి కారణం అయి ఉండొచ్చననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ కావడం కూడా.. బీఆర్ఎస్ ఫలితాలపై ప్రభావం చూపించిందన్నది మరికొందరి వాదన. ఇక అటు కవితను జైలు నుంచి విడిపించుకోవడం కోసం బీజేపీతో బీఆర్ఎస్ రహస్య ఒప్పందం చేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇదే నిజమైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ బీజేపీలో తమ పార్టీని విలీనం చేస్తారా అనే ప్రశ్న అందరిలోనూ వినిపిస్తోంది. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం అనేది జరగదనీ గుళాబీ బాస్ గట్టిగానే ఆన్సర్ ఇస్తున్నారు.