కల్కి మూవీని మహాభారతానికి సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ కథ మొత్తం కల్కి, అశ్వత్థామల చుట్టూ తిరుగుతుంది. అయితే అసలు అశ్వత్థామ ఎవరు? ఆయనకి శాపం ఏంటి? గర్భంలోకి బాణం ఎందుకు వదిలాడు? కల్కిని అశ్వత్థామ ఎందుకు కాపాడాడు ? సప్త చిరంజీవుల్లో అశ్వత్థామకే ఈ బాధ్యతలను శ్రీకృష్ణుడు ఎందుకు అప్పజెప్పాడు… ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి అర్థం కాలేదు. కల్కి మూవీని మీరు ఎంజాయ్ చేయాలంటే.. ఈ అశ్వత్థామ కథ పూర్తిగా తెలుసుకోవాల్సిందే.
మహాభారతంలో అశ్వత్థామ పాత్ర చాలా భిన్నం. కామం, క్రోధం లాంటి అవలక్షణాలతో పుట్టిన వ్యక్తి. పుట్టుకతోనే ఎంతో ఆవేశాన్ని కలిగిన వ్యక్తి… ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు. ఎవర్ని ఎప్పుడు సమర్థిస్తాడో తెలీదు. భారతంలో అతి ముఖ్యమైన పాత్రల్లో ఒకటైన అశ్వత్థామ ఎవరో తెలుసుకోవాలంటే… అతని తల్లిదండ్రుల గురించి కూడా తెలుసుకోవాలి. అశ్వత్థామ తండ్రి… పాండవులు… కౌరవులకు గురువైన ద్రోణుడు. తల్లి పేరు కృపి. భరద్వాజ మహర్షి తన క్షేత్రాన్ని ఓ కుండలో ఉంచితే… అందులో నుంచి పుట్టినవాడు ద్రోణుడు. కుండలను ద్రోణ అని కూడా పిలుస్తారు. కుండలో పుట్టినవాడు కాబట్టి… ద్రోణుడు అయ్యాడు. ఇక అశ్వత్థామ తల్లి అయిన కృపి… శరద్వాన్ మహర్షి, ఖగోళ వనదేవత జనపది కుమార్తె. మహర్షి తన మానసిక శక్తితో కవలలను పుట్టించారు. వారిలో ఒకరు మగ… మరొకరు ఆడ. వాళ్ళిద్దర్నీ అడవిలో చూసిన భీష్ముడి తండ్రి శంతనుడు… వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటాడు. కృపతో పెంచాడు కాబట్టి… వాళ్ళ పేర్లు కృపాచార్య… క్రుపి అయ్యాయి. ఈ కవల బిడ్డల్లో కృపిని ద్రోణాచార్యుడు పెళ్ళి చేసుకున్నాడు. ఇలా విచిత్ర పరిస్థితుల్లో పుట్టిన ద్రోణుడు, కృపి భార్యభర్తలు అయ్యారు. వాళ్ళిద్దరికీ పుట్టిన విచిత్ర వ్యక్తే అశ్వత్థామ. ఈయన పుట్టగానే గుర్రంలాగా సకిలించాడట… గుర్రం అంటే అశ్వం… అందుకే అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు. శివుడి అంశతో పుట్టినవాడే అశ్వత్థామ… అందుకే ఆ రౌద్రుడి కోపం కూడా అశ్వత్థామకు ఉంది. ప్రపంచాన్ని జయించాలన్న కసి ఉండేది… కానీ ఆచార్యుడి కొడుకు కావడంతో… తన కోరికలను అణుచుకుంటూ బతికేవాడు అశ్వత్థామ.
ఏ మనిషిని అయినా పతనం చేసేవి… మోహం, మదం, మాత్సర్యం… ఈ మూడు కూడా అశ్వత్థామలో కనిపిస్తాయి. తండ్రి ద్రోణుడు గురువు స్థానంలో ఉన్నాడు..కాబట్టి… అతనికి తెలిసిన విద్యలన్నీ తనకీ తెలియాలని అనుకున్నాడు అశ్వత్థామ. అందులో తప్పులేదు. కానీ ద్రోణుడి ప్రియశిష్యుడైనా అర్జునుడు అంటే కోపం… దుర్యోధనుడిలాగే కిరీటీపైనా అసూయను పెంచుకున్నాడు. కొన్ని విద్యలు నేర్చుకోవాలంటే… కొన్ని అర్హతలు కూడా ఉండాలి. కానీ ఇవేమీ ఆలోచించే పరిస్థితుల్లో ఉండేవాడు కాదు అశ్వత్థామ. తాను ద్రోణుడిని కొడుకుని అనే అహంకారం… అశ్వత్థామకు ఉండేది.
గురువుకి ఎప్పుడైనా మంచి శిష్యుడంటేనే ఇష్టం. అలా ద్రోణుడికి అర్జునుడు అంటేనే ఇష్టం ఉండేది. కానీ అది ఇష్టంలేని అశ్వత్థామ ఎన్నోసార్లు అర్జునుడికి అడ్డుపడేవాడు. అవేమీ అర్జునుడి ముందు పనిచేయలేదు. అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకోవాలంటే ఎవరికైనా ఓపిక… సహనం కావాలి. మనం యుద్ధం చేసేటప్పుడు… సామాన్యులకు నష్టం కలగకుండా… శత్రువుని మాత్రమే తుదముట్టించేలా ఆయుధాన్ని వాడాలి. అంత ఓపిక అశ్వత్థామకు ఉండేది కాదు. కానీ అర్జునుడి విషయం వేరు. ఇలాంటి ఓర్పు, నేర్పుల్లో అతనే దిట్ట. అందుకే ద్రోణుడు అందరి కంటే ముందు… బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని కూడా అర్జునుడికే నేర్పించాడు. అది అశ్వత్థామకు అస్సలు నచ్చలేదు. ఆ తరువాత వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి… తనకి కూడా బ్రహ్మాస్త్ర విద్యను నేర్పించాలని కోరాడు. అశ్వత్థామ ఎంతో ఆవేశపరుడు అని ద్రోణుడికి తెలుసు… కానీ కన్న కొడుకుని కాదలేని పరిస్థితి. అందుకే బ్రహ్మాస్త్రం ఎలా ప్రయోగించాలో చెప్పాడు కానీ… దానికి ఉపసంహారం మాత్రం చెప్పలేదు. అంతేకాదు… అసలు బ్రహ్మాస్త్రం ప్రయోగం ఎంత ప్రమాదకరమో కూడా అశ్వత్థామకు వివరించాడు ద్రోణుడు. అది ప్రయోగిస్తే… ఆ ప్రాంతంలో 12యేళ్ళ పాటు ఒక్క మొక్క కూడా మొలవదనీ… ఎంతోమంది చనిపోతారని కూడా హెచ్చరించాడు. అలా చెప్పడం వల్ల అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడని అనుకున్నాడు ద్రోణుడు. అశ్వత్థామ వాటిని పెద్దగా పట్టించుకోలేదు.
పైగా అశ్వత్థామ తన దగ్గర బ్రహ్మాస్త్రం ఉందన్న ధీమాతో ఏకంగా శ్రీకృష్ణుడితోనే గొడవకు దిగుతాడు. ఓసారి ద్వారకకు వెళ్తాడు.. అక్కడ శ్రీకృష్ణుడితో… నేను బ్రహ్మాస్త్రం ఇస్తా… అందుకు బదులుగా నీ సుదర్శన చక్రం ఇవ్వమని అడిగాడు. ఈ చక్రం నీకెందుకని శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. అప్పుడు అశ్వత్థామ… నాకు ప్రపంచాన్ని జయించాలని ఉంది. నిన్ను గెలిస్తే… ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే కదా… అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడిని ఓడించి… ఈ ప్రపంచాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలన్న నియంతృత్వ భావన అశ్వత్థామలో అడుగడుగునా ఉండేది. అసలు అశ్వత్థామలో ఎంత శక్తి ఉందో తెలుసుకోవాలని… అదుగో చక్రాయుధం…దాన్ని తీసుకోమని చూపించాడు శ్రీకృష్ణుడు. సుదర్శన చక్రాన్ని ఒక్క శ్రీకృష్ణుడు మాత్రమే సంధించగలేదు. ఆ చక్రాన్ని తీసుకోడానికి ప్రయత్నించిన అశ్వత్థామ… ఒక్క అంగుళం కూడా కదిలించలేకపోయాడు. అప్పుడే అతని అహంకారం మొత్తం దిగిపోయింది. అవమాన భారంతో ద్వారక నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి పాండవులన్నా… శ్రీకృష్ణుడు అన్నా… అశ్వత్థామకు అసూయ, ఆగ్రహం ఉండేది. అందుకే ఆయన కౌరవుల పంచన చేరాడు. కురుక్షేత్రంలో కూడా కౌరవుల పక్షానే అశ్వత్థామ యుద్ధం చేశాడు. ఆయనపై ఉన్న పుత్ర ప్రేమతో ద్రోణుడు… నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం లాంటి భీకర అస్త్రాలను అశ్వత్థామకు నేర్పించాడు ద్రోణుడు.
ఈ రెండు అస్త్రాలతో పాండవులను చంపేయొచ్చని అనుకుంటాడు. నారాయణాస్త్రాన్ని అర్జునుడిపై ప్రయోగిస్తాడు. విష్ణు శక్తి కలిగినది నారాయణాస్త్రం. అందుకే అది శ్రీకృష్ణుడిని చూడగానే పూలమాలగా మారిపోయింది. ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడు బ్రహ్మాస్త్రంతో పడగొట్టాడు. అక్కడితో అశ్వత్థామ వీరత్వం అయిపోయింది. కానీ అహంకారం మరింత పెరిగింది. కరుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు… తన తండ్రి ద్రోణుడు… కర్ణుడి మరణాలను చూసిన తర్వాత… అతనిలో ఆలోచన మొదలైంది. యుద్ధం చివర్లో దుర్యోధనుడికి నచ్చజెప్పాడు. పాండవులను జయించడం అంత సులభం కాదని కూడా అంటాడు. సంధి చేసుకోమని సలహా ఇస్తాడు. అందుకు దుర్యోధనుడు ఒప్పుకోడు. యుద్ధం చివరి రోజుల్లో అశ్వత్థామ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఎవరికీ కనిపించడు. దుర్యోధనుడి తొడలను భీముడు విరగొట్టి ద్రౌపదితో చేసిన ప్రతిజ్ఞను తీరుస్తాడు. ఆ సన్నివేశాన్ని అశ్వత్థామ కూడా దూరం నుంచి చూశాడు. ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న దుర్యోధనుడిని చూసి… అశ్వత్థామలో మళ్ళీ ఉన్మాదం నిద్రలేచింది. పాండవులందర్నీ చంపేస్తానని కొన ఊపిరితో కొట్టుకుంటున్న దుర్యోధనుడికి మాట ఇస్తాడు అశ్వత్థామ. ఆయనలో ఆవేశాన్ని చూసిన దుర్యోధనుడు… కౌరవ సైన్యానికి చివరి సైన్యాధ్యుడిగా అశ్వత్థామను ప్రకటిస్తాడు. ఆ తర్వాత కాసేపటికే అశ్వత్థామలో ఆవేశం తగ్గిపోతుంది. కానీ మిత్రుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాట గుర్తుకొస్తుంది… అయితే పాండవులను ఎలా చంపాలో అశ్వత్థామకు అర్థం కాదు. దుర్యోధనుడికి మాట ఇచ్చిన రోజు రాత్రి అశ్వత్థామకు నిద్ర పట్టదు. ఆవేశంతో ఊగిపోతాడు. అంతలోనే చెట్టు మీద ఓ దృశ్యాన్ని చూశాడు. గుడ్లగూబ … నిద్రపోతున్న పక్షులను నిశ్చబ్ధంగా చంపడాన్ని గమనిస్తాడు. ఆ సన్నివేశం చూసిన అశ్వత్థామకు కూడా ఓ దారుణమైన ఆలోచన వచ్చింది. నేరుగా పాండవుల శిబిరంలోకి వెళ్తాడు. అర్థరాత్రి సమయంలో… అంతా నిద్రలో ఉంటారు. అలా నిద్రలో ఉన్నప్పుడే పాండవులను చంపాలని అనుకుంటారు. కానీ అక్కడ పాండవులు కనిపించలేదు. అప్పుడు అశ్వత్థామ కోపం హద్దులు దాటుతుంది. ఉన్మాదంతో ఊగిపోతాడు.
ఆ సమయంలోనే అతని చేతులోకి రుద్రాంశతో ఓ ఖడ్గం చేతికి వచ్చినట్టు భారతం చెబుతోంది. ఇక ఆ కత్తి పట్టుకొని… మహాభారతం మొత్తంలోనే అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడ్డాడు అశ్వత్థామ. అదే నిద్రలో ఉన్నవారని చంపడం. మొదట పాంచాల రాజు శిబిరంలోకి వెళ్ళాడు. అక్కడ నిద్రపోతున్న దృష్టద్యుమ్నుడిని అత్యంత క్రూరంగా పొడిచి చంపాడు. తన తండ్రి అయిన ద్రోణుడిని తలను కురుక్షేత్రంలో నరికింది… దృష్టద్యుమ్నుడే. అక్కడ శిబిరంలో ఉన్న వీరులందర్నీ చంపేస్తాడు అశ్వత్థామ. అయినా ఆవేశం చల్లారకపోవడంతో… చివరకు గుర్రాలు, ఏనుగులను కూడా చంపేస్తాడు. ఆ తర్వాత పాండవ శిబిరంలోకి వస్తాడు. పాండవుల కుమారులు ఐదుగురైన ఉపపాండవులను నిద్రలో ఉండగా చంపేశాడు అశ్వత్థామ. అలా ఆ రోజు రాత్రి… ఎవరు కనిపిస్తే వాళ్ళని చంపుకుంటూ వెళ్తాడు. ఇంకా అప్పటికీ కొనఊపిరితో ఉన్న దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి… తాను ఈ రాత్రి చేసిన హత్యాకాండ గురించి చెబుతాడు. ఇది విన్న తర్వాత ధుర్యోధనుడు చనిపోతాడు. అంతమంది చంపిన తర్వాత అప్పుడు అశ్వత్థామలో ఆవేశం చల్లారుతుంది.
ఆ ఉన్మాదం మత్తు వీడాక… తాను చేసిన తప్పు గురించి తలుచుకొని భయపడతాడు అశ్వత్థామ. అక్కడ నుంచి పారిపోతాడు. భాగీరధి నది తీరానికి వెళ్ళి… సన్యాసి వేషం వేసుకుంటాడు. కొన్నాళ్ళు దొంగలా దాక్కున్నాడు… ఎంత దాక్కోవాలని చూసినా… పాండవులు మాత్రం అశ్వత్థామను పట్టుకుంటారు. కానీ ఇప్పుడు అశ్వత్థామ దగ్గర ఉన్నది ఒకే ఒక అస్త్రం… అదే బ్రహ్మాస్త్రం … అది ఎట్టి పరిస్థితుల్లోనూ వాడనని… గతంలో తండ్రికి మాట ఇస్తాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించడమే కానీ… దాన్ని ఉపసంహరించడం ఎలాగో అశ్వత్థామకి తెలియదు. కానీ ఉత్తర గర్భంలో పెరుగుతున్న పిండం మీదకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు తన శక్తితో… బ్రహ్మాస్త్రానికి ఎదురుగా వెల్ళి… ఉత్తర గర్భంలో పెరుగుతున్న శిశువును రక్షిస్తాడు. ఆ తర్వాత ఉత్తర పరీక్షుత్తునకు జన్మ ఇస్తుంది. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరిస్తాడు. విధ్వంసం జరక్కుండా కాపాడతాడు. అశ్వత్థామ ఇంత విధ్వంసం సృష్టించినా… తమ గురువు పుత్రుడు కాబట్టి… తన కన్నబిడ్డల్ని చంపేసినా ఆయన్ని క్షమిస్తుంది ద్రౌపది. వ్యాసుడు మాత్రం అశ్వత్థామను క్షమించడు. నువ్వు చేసిన పనికి… నీ తలపై ఉన్న శిరోమణిని పాండవులకు ఇవ్వమనీ… . ఇదే నీకు విధిస్తున్న శిక్ష అంటాడు. అశ్వత్థామ శిరస్సుపై ఓ శిరోమణి ఉంటుంది… కర్ణుడికి కవచకుండలాలులాగా. ఆ మణి కలిగిన వారికి… ఆకలి ఉండదు… దాహం ఉండదు… విపరీతమైన శక్తి ఉంటుంది. ఆ మణి ఉన్నంతవరకూ అశ్వత్థామను ఎవరూ ఏమీ చేయలేరు. అలాంటి ఎంతో విలువైన మణిని ఇచ్చేస్తే… అశ్వత్థామ బతికి ఉన్నా… మరణించిన వాడితో సమానం. అయినా వ్యాసుడి ఆదేశాలకు తలవొంచి… తన మణిని తీసి పాండవులకు ఇచ్చాడు అశ్వత్థామ. ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వత్థామను శ్రీకృష్ణుడు ఘోరంగా శపిస్తాడు. పసిపిల్లలను చంపినందుకు… గర్భిణీపై ఆయుధాన్ని ప్రయోగించినందుకు… 3 వేల యేళ్ళ పాటు దుర్గంధం వెదజల్లుతూ అడవుల్లో తిరుగమని అశ్వత్థామను శపిస్తాడు. మూడు వేల యేళ్ళు అంత దారుణంగా బతికే బదులు… వెంటనే చావడమే మేలని శ్రీకృష్ణుడి బతిమలాడుకుంటాడు అశ్వత్థామ. అయితే 3 వేల యేళ్ళ తర్వాత నువ్వు మహర్షివి అవుతావు… అప్పుడున్న అవతార పురుషుడికి సహకరించి… చిరంజీవిగా వర్ధిల్లుతావు. అని వరం కూడా ఇస్తాడు శ్రీకృష్ణుడు. శాపం తీరిన వెంటనే అశ్వత్థామ శిరోమణి అతని శిరస్సు పైకి వస్తుంది. ఆ మణి ఉన్నంత కాలం… అశ్వత్థామకు మరణం లేదు. అందుకే పురాణాల్లో వివరించే ఏడుగురు చిరంజీవుల్లో… అశ్వత్థామ కూడా ఒకరు. అలా శాపం… బలంతో అశ్వత్థామ అడవిలోకి వెళ్లాడు.
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిన సంవత్సరం… 3 వేల 138 B.C.E. అక్కడి నుంచి 3 వేల యేళ్ళు… అంటే… 138 B.C.E. వరకూ అశ్వత్థామ అరణ్యాల్లో దుర్గంధంతో బతుకుతాడు. ఆ తర్వాత ఎక్కడో తపస్సు చేసుకుంటాడు. అతను శివుడి అంశం కావడం వల్ల… ఇప్పటికీ ఏదో ఒక చోట… మాయా రూపంలో శివుడి గురించి తపస్సు చేసుకుంటూ ఉన్నాడని మహర్షులు చెబుతుంటారు. ఇంత ఘోరమైన పాపాలకు పాల్పడిన అశ్వత్థామకు శాపాలతో పాటు వరం కూడా శ్రీకృష్ణుడు ఎందుకు ఇచ్చాడు…. అశ్వత్థామ మహా వీరుడు… అతినిది శివాంశ. కలియుగంలో ధర్మం తప్పినప్పుడు కల్కి అవతారం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ కల్కి పురాణం ప్రకారం… కల్కి పుట్టే నాటికి శంభల ప్రాంతంలో అశ్వత్థామ ఉంటాడు. కల్కి విష్ణువు అవతారమే అయినా… అతనిలో శివాంశ ఉంటేనే దుష్టులను శిక్షించగలడు. అందుకే కల్కి అవతారం నాటికి అశ్వత్థామ అతడిని చేరుకుంటాడు.
అతనికి కల్కి అని పేరు పెట్టింది కూడా అశ్వత్థామ, పరుశురాముడే అని కల్కి పురాణంలో ఉంది. వీళ్ళిద్దరే కల్కికి అన్ని విద్యలూ బోధిస్తారనీ… ఆ తర్వాత దుష్ట శిక్షణలో అతనికి సహకరిస్తారని కల్కి పురాణం చెబుతుంది. కలియుగం మొదలైన 6 వేల యేళ్ళకు ఈ భూమ్మీద అరాచకాలు పెరుగుతాయనీ… ప్రజలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటారనీ… ధర్మం పూర్తిగా కనిపించకుండా పోతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కల్కి అంశంతో వీరుడు పుట్టి… భూమిని ఉద్దరిస్తాడని అంటున్నారు. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించిన… 3102 BCE లో కలియుగం మొదలైంది. 2 వేల 898 నాటికి కలియుగం మొదలై 6 వేల యేళ్ళు పూర్తవుతాయి. అప్పటికి భూమి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ భవిష్యత్తు కాలమంతా అశ్వత్థామకు తెలుసు. అందుకే ఆయన 2 వేల 898 సంవత్సరం నాటికి తన తపస్సు నుంచి బయటకు వస్తాడు. ఆనాడు శ్రీకృష్ణ అవతారం ఉన్నప్పుడు… పాండవులకు తాను చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా…. కల్కి అవతారానికి సహకరించి… దుష్ణ శిక్షణ చేస్తాడు. కల్కి మూవీలో అమితాబ్ ను అశ్వత్థామగా చూపించారు. అతడిని శివభక్తుడిగా… శిరోమణి కలిగిన చిరంజీవిగా చూపించారు. ఇది అశ్వత్థామ స్టోరీ. కల్కికి అతను ఎందుకు సహకరించాడు… ఎలా సహకరించాడన్నది కల్కి సినిమాలో చూపించారు.