Rice Price: కిలో బియ్యం రూ. 300

బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అమెరికాలో రేట్లు భారీగా పెరిగాయి. యూఎస్ మాత్రమే కాదు యూఏఈ, ఆస్ట్రేలియా.. ఇలా అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - July 26, 2023 / 03:49 PM IST

బియ్యం కోసం అన్నమో రామచంద్రా అంటున్న పరిస్థితి ఎన్ఆర్‌ఐలది. సూపర్‌మార్కెట్‌ల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్‌లు కనిపిస్తున్నాయ్. యూఎస్‌లో చాలా సూపర్‌ మార్కెట్ల ముందు నో స్టాక్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయ్. దీంతో వ్యాపారులు బియ్యం రేట్లను అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. కిలో 3వందల రూపాయలకు బియ్యం విక్రయిస్తున్నారు. ఎంత ఎక్కువ ధర ఉన్నా కొనుగోలు చేసేందుకు ఎన్ఆర్‌ఐలు వెనకడుగు వేయడం లేదు. దీంతో వ్యాపారులకు ఆడింది ఆటలా మారిపోయింది. డల్లాస్‌లో సోనా మసూరి బియ్యానికి భారీగా డిమాండ్ పెరిగింది.

జూలై 20 నుంచి ధరల పెరుగుదల కారణంగా.. బియ్యం ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. బాస్మతి బియ్యం తప్ప మిగతా అన్ని రకాల బియ్యం ఎగుమతులను నిలిపివేసింది. గతేడాది మొత్తం 22 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతుల్లో దాదాపు 10 మిలియన్ టన్నుల బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై పరిమితులు విధించింది. దేశీయ మార్కెట్ లో తెల్లబియ్యం తగినంత లభ్యత, ధరల స్థీరీకరణే లక్ష్యంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా వ్యవసాయ శాఖ ప్రకారం.. ఆ దేశం వినియోగించే బియ్యంలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు ఆ ఎగుమతులపై నిషేధం విధించడంతో.. అక్కడి ఎన్ఆర్ఐలు అల్లాడిపోతున్నారు.