అంబానీ వారి పెళ్లి సందడి అదుర్స్ అనిపించింది. వారం రోజుల పాటు వేడుకగా జరిగిన ఈ కార్యక్రమం గురించి.. ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. 12న ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో.. అనంత్, రాధికా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వారం రోజుల పాటు అంతకుముందు సంగీత్ నిర్వహించారు. ఆ తర్వాత శుభ్ ఆశీర్వాద్ వేడుకలను చేపట్టారు. కొత్త జంటను ఆశీర్వదించడానికి దేశ, విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు, క్రికెటర్లు వచ్చారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు ఈ వేడుకలో పాల్గొన్నారు.
రాధిక మర్చంట్ అడుగుపెట్టిన వేళా విశేషమేంటో కానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆస్తులు భారీగా పెరిగాయ్. ఏకంగా 25వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు పెరిగాయ్. 10రోజుల వ్యవధిలోనే అంబానీ ఆస్తుల విలువ 25వేల కోట్లకు పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. జూలై 5న 118 బిలియన్ డాలర్లుగా ఉన్న అంబానీ ఆస్తులు… 10రోజుల వ్యవధిలో 121 బిలియన్ డాలర్లకు పెరిగాయ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్‌లోని అన్ని కంపెనీల షేర్ల ధరలు కూడా ఒకటి కంటే ఎక్కువ శాతం మేర పెరిగాయ్. అంబానీ గ్లోబల్ ర్యాంకింగ్ కూడా భారీగా మెరుగుపడింది. పెళ్లికి ముందు వరకు అత్యంత ధనవంతుల జాబితాలో 12వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ.. ఆ తర్వాత 11వ స్థానానికి ఎగబాకారు. ఆసియాలోకెల్లా అత్యంత ధనవంతుల జాబితాలో తొలిస్థానాన్ని నిలబెట్టుకున్నారు. కొడుకు పెళ్లి కోసం అంబానీ అక్షరాలా 5వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారంటూ వార్తలు రాగా.. ఇప్పుడు అదే స్థాయిలో ఆదాయాన్ని రాబట్టుకున్నారు. పెళ్లి ఖర్చుకు అయిదంతల ఆదాయం వచ్చింది.