కాంగ్రెస్ ఇంతే.. కాంగ్రెస్‌లో ఇంతే అనే ఓ టాక్ ఉంటుంది ఎప్పుడు! హస్తం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ పార్టీకి అదే బలం, అదే బలహీనత కూడా ! ఆ బలహీనతతోనే రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో రెండుసార్లు అధికారానికి దూరం అయింది. పదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కట్ చేస్తే.. ఆ పార్టీలో మాత్రం మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్‌లో అంతే అనే భావన కలుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఆరు నెలలు దాటింది. ఐతే ఇప్పటివరకు పూర్తిస్థాయిలో కేబినెట్ కొలువుదీరలేదు. రేవంత్‌తో పాటు 11మంది మంత్రులతో మాత్రమే మంత్రివర్గం ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. ఐతే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చికూడా నెల రోజులు దాటింది. ఐనా సరే అడుగు ముందుకు పడడం లేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ మార్పు అన్నారు.. జరగలేదు. కేబినెట్ విస్తరణ అన్నారు అదీ జరగలేదు.
కొత్త పీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టి హైకమాండ్.. రేవంత్‌ను ఢిల్లీకి పిలిచి పలుమార్లు చర్చించింది. పీసీసీ చీఫ్‌తో పాటు.. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలనేదానిపై రేవంత్ కొన్ని పేర్లను అధిష్టానానికి ప్రతిపాదించారు. ఐతే అది ప్రతిపాదనతోనే ఆగిపోయింది. మంత్రిపదవుల విషయంలో హైకమాండ్‌కు రేవంత్ కొన్ని పేర్లు ప్రతిపాదించగా.. కొందరు సీనియర్ నేతలు, మంత్రులు వాటిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేతల మధ్య పంచాయితీ ఇప్పట్లో తేలుతుందా అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎవరికి పదవి ఇచ్చినా.. ఇంకొకరి నుంచి అభ్యంతరం వ్యక్తం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
కోమటిరెడ్డి రాజగోపాల్‌కు మంత్రి పదవి ఇస్తే… ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రులు ఇచ్చారని.. తన భార్యకి కూడా పదవి ఇవ్వాలని ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిట్టింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే… పీసీసీ అధ్యక్ష పదవి, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ తన భార్య పద్మావతికి ఇవ్వాలని ఉత్తమ్ పట్టుబడుతున్నారు. ఇక అటు తన మనుషులకి మంత్రి పదవులు ఇప్పించుకోవడానికి డిప్యూటీ సీఎం భట్టి పట్టుబడుతున్నారు. ప్రేమ్‌సాగర్ రావుతో పాటు మరో ఇద్దరికి మంత్రి పదవులు ఇప్పించే పనుల్లో భట్టి బిజీబిజీగా ఉన్నాడు.
ఇక అటు సీతక్కకు హోంతో పాటు.. తన వాళ్లకు మంత్రి పదవులు ఇప్పించే విషయంలో సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నారు. ఇలా ఒకరికి చెక్ పెట్టుకుంటూ మరొకరు.. కొందరికి మంత్రి పదవులు రాకుండా ఇంకొందరు.. హస్తం పార్టీలో చిన్నపాటి తుఫాన్ కనిపిస్తోంది. ఇక బీసీ కోటాలో మధు యాష్కి గౌడ్.. తనకు పీసీసీ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పీక్స్‌కు చేరుకున్నాయ్. దీంతో పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు.. మంత్రివర్గ విస్తరణను వాయిదావేసింది. అంతర్గత విబేధాలు క్లియర్ అయిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలని.. ఈలోపు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అటు రేవంత్ మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయ్. ప్రస్తుతం నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటివరకు కేబినెట్‌లో చోటు దక్కిని జిల్లాలకు అవకాశం కల్పించే ఉద్దేశంతో నలుగురు పేర్లను సీఎం రేవంత్ అధిష్టానానికి ప్రతిపాదించారు. ఇదే సమయంలో పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టివిక్రమార్కతో చర్చించగా.. వాళ్లు ఇతర పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.