BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయన ఎక్కడ ఉన్నా హైదరాబాద్‌కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో సాహిల్ నిందితుడిగా ఉన్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. దుబాయ్ పారిపోయినట్లు సమాచారం. కానీ సాహిల్ ఇక్కడే ఎక్కడో ఉండవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్ శాఖలోనే కొందరు మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సహకరిస్తున్నారన్న సమాచారం కూడా ఉంది.
ఈనెల 23న ప్రజాభవన్ దగ్గర ఓ కారు బారీకేడ్లను ఢీకొట్టింది. వెంటనే పోలీసులు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అతడిని విచారించగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అని తేలింది. బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా.. ఫుల్లుగా మద్యం తాగినట్లు తెలిసింది. షకీల్ ఒత్తిడి చేయడంతో.. ఆయన కొడుకును కేసు నుంచి తప్పించి ఇంట్లో పనిచేసే డ్రైవర్ మీద FIR నమోదు చేశారు పోలీసులు. ఈ విషయం సీపీ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. వెస్ట్‌జోన్ డీసీపీ దర్యాప్తు చేయగా.. అసలు విషయం బయటపడింది. ప్రజాభవన్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. స్టేషన్‌లోని కెమరాల ఫుటేజీని చూశాక.. సాహిల్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా సాహిల్‌ను తప్పించినట్లు గుర్తించిన డీసీపీ.. రిపోర్ట్‌ను సీపీకి ఇచ్చారు. దాంతో పంజాగుట్ట సీఐ దుర్గారావు, ASI విజయ్‌కాంత్‌ను సస్పెండ్ చేశారు.
ఈ కేసు ఎక్కడ తన వరకు వస్తుందోనని ముందే పసిగట్టిన సాహిల్.. దేశం విడిచిపారిపోయాడు. ముంబై మీదుగా దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో అలర్టయిన పోలీసులు.. అతడిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో సాహిల్‌ను ఏ1గా చేర్చారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్ గతంలో ఏం నేరాలు చేశాడన్న దానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. గత ఏడాది మార్చిలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అర్థరాత్రి వేగంగా కారు దూసుకు వచ్చిన ప్రమాదంలో ఓ చిన్నారి చనిపోయింది. ముగ్గురు గాయపడ్డారు. ఆ కారు అప్పటి ఎమ్మెల్యే షకీల్ దే. ప్రమాదం జరిగినప్పుడు సాహిల్ కారులోనే ఉన్నా.. డ్రైవింగ్ సీట్లో వేరేవాళ్ళు ఉన్నట్టు కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసు డిటైల్స్ ను వెస్ట్ జోన్ డీసీపీ తన ఆఫీసుకు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఆ కేసులో అరెస్ట్ అయిన డ్రైవర్.. సెల్ టవర్ లొకేషన్.. ఆరోజు ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడ ఉంది ? అన్నది చెక్ చేస్తున్నారు. అప్పట్లో ఈ వివరాలు గానీ.. డిజిటల్ ఎవిడెన్స్ ను ఎందుకు సేకరించలేదని.. ఎంక్వైరీ ఆఫీసర్ ను వివరణ కోరాలని డీసీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.