తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఓడిపోయి అధికారం పోగొట్టుకున్న బీఆర్ఎస్… వచ్చే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) మళ్ళీ పుంజుకొని తమ బలం నిరూపించుకోవాలని చూస్తోంది. అందుకోసం గులాబీ బాస్ కేసీఆర్ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్న జిల్లాలపైనే కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కంచుకోటలను బద్దలు కొడితే ఇక రాష్ట్రంలో తమకు తిరుగు ఉండదని భావిస్తున్నారు.
ఓటమి తర్వాత కొన్ని నెలలుగా రెస్ట్ తీసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇప్పుడు లోక్ సభ ఎన్నికల కోసం కొత్త స్ట్రాటజీతో ముందుకొస్తున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలి… అక్కడే ఎంపీ సీట్లు గెలుచుకోవాలి అనుకుంటున్నారు. అందుకోసం కాంగ్రెస్ కంచుకోటగా మారిన జిల్లాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో హస్తం పార్టీకి ఎమ్మెల్యేల బలం బాగా ఉంది. నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఆ పార్టీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ నాలుగు జిల్లాల్లో లోక్ సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పుంజుకుంటే… కాంగ్రెస్ ను నైతికంగా దెబ్బతీయడానికి పనికొస్తుంది. అలాగే తమ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు.
అందుకే KRMBకి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను అప్పగించిందంటూ మొదటి ఆందోళన, బహిరంగ సభను నల్లగొండ నుంచే ప్రారంభించారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే… అందులో ఒక్క సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తప్ప… మిగిలిన అన్ని చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. గెలిచిన వారిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుత బహిరంగ సభకు జనాన్ని తరలించేందుకు నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇంఛార్జులను కూడా BRS నియమించింది. అసలు తమ లోక్ సభ ఎన్నికల క్యాంపెయిన్ ను వరంగల్ నుంచి ప్రారంభించాలని మొదట భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కృష్ణా జలాల సాధన పోరాటం కాబట్టి…నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఎంచుకున్నారు. ఈ మీటింగ్ పరిధిలోకి నల్లగొండ, భువనగిరి ఎంపీ సీట్లు వస్తాయి. 2019లో ఈ రెండింటికీ కాంగ్రెస్ గెలుచుకుంది.
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కు కీలకమైన ఆ నాలుగు జిల్లాలపై పట్టుకోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ జిల్లాల్లో లోక్ సభ సీట్లను గెలుచుకుంటే… వచ్చే ఐదేళ్ళ వరకూ కేడర్ కు మంచి బూస్టింగ్ గా ఉంటుందని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్స్ రెడీ చేస్తున్నారు.