BRS ప్రభుత్వ హయాంలో మాజీ డీసీపీ ప్రణీత్ రావు చేసిన అరాచకాలు చాలా బయటకు వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో రెండు గదుల్లో వార్ రూమ్స్ సెటప్ చేసుకొని… వీళ్ళు వాళ్ళు అని లేదు. ప్రతిపక్ష నేతలు, అధికారులు, వాళ్ళ కుటుంబసభ్యులు, బంధువులు… వ్యాపారవేత్తలు, రియల్టర్లు, మీడియా ప్రతినిధులు ఇలా అందరి ఫోన్లూ టాప్ చేశాడు. BRS లో పెద్ద లీడర్లు, SIB మాజీ చీఫ్ ఇంకా కొందరు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పినట్టల్లా ఆడాడు. వాళ్ళు ఎవరి ఫోన్ ట్యాప్ చేయమంటే వాళ్ళది చేసి ఆ ఇన్ఫర్మేషన్ పెద్దలకు అందించాడు. ఫోన్లు ట్యాపింగే కాదు… వాట్సాప్ ఛాటింగ్స్ కూడా సేకరించాడంటే ప్రణీత్ రావుకు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ స్థాయిలో పెద్దలు, అధికారుల అండ ఉందో అర్థమవుతుంది. ప్రణీత్ రావును అరెస్ట్ చేసి సమాచారం రాబట్టిన పంజాగుట్ట పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ ట్యాపింగ్ కేసులో గత ప్రభుత్వ పెద్దల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. SIB లో మరో నలుగురు అధికారుల పేర్లను కూడా ప్రణీత్ రావు బయటపెట్టాడు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి విచారణ జరపాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులకు అండగా ఉండేందుకు రాజకీయ పార్టీలు వార్ రూమ్స్ ఏర్పాటు చేసుకుంటే… ప్రణీత్ రావు కూడా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో వార్ రూమ్స్ పెట్టాడు. వరంగల్ కి చెందిన ఓ బీఆర్ఎస్ నేత ఆదేశాలతో పర్వతగిరిలోనూ వార్ రూమ్ సెటప్ చేశాడు. ఆ జిల్లాలో అపోజిషన్ లీడర్ల ఫోన్లతో పాటు వాళ్ళకి నిధులు ఇచ్చే వ్యాపారవేత్తల ఫోన్ టాకింగ్స్ పై నిఘా పెట్టాడు. ఆ సమాచారంతోనే వరంగల్ కు చెందిన ఆ లీడర్… ప్రతిపక్ష నేతలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించాడు. కరీంనగర్, సిద్ధిపేట, గజ్వేల్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లోనూ ప్రణీత్ రావు వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు తేలింది. ఎన్నికల ఫలితాలు వచ్చాక… వేల సంఖ్యలో డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్ లు… అన్నీధ్వంసం చేశాడు ప్రణీత్ రావు.
ప్రభుత్వ పెద్దలు చెప్పిందే కాదు… ఓ వజ్రాల వ్యాపారి కోసం కూడా పని చేశాడు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. ఆ వ్యాపారి ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసి సమాచారం అందించాడు. దాంతో ఆ వజ్రాల వ్యాపారి భారీగా ముడుపులు అందించినట్టు తెలుస్తోంది. అలాగే సంధ్య కన్వెన్షన్ ఎండీ, వ్యాపారవేత్త శ్రీధర్ రావు తనతో పాటు తన కుటుంబసభ్యుల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేశాడని పంజాగుట్ట పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. తన ఫోన్లను ట్యాప్ చేసి బెదిరించడమే కాకుండా… తనపై 40కి పైగా అక్రమ కేసులను పెట్టించినట్టు ఆరోపించారు. ఈ కుట్రలో ప్రణీత్ రావుతో పాటు అప్పటి IPS అధికారి ప్రభాకర్ రావు ప్రమేయం కూడా ఉందన్నారు. పంజాగుట్ట పోలీసులు ఈ కేసు కూడా రిజిస్టర్ చేశారు. ప్రణీత్ రావు కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన్ని కస్టడీలోకి తీసుకుంటే గత BRS ప్రభుత్వంలో పెద్దల బండారం బయటపడుతుందని భావిస్తున్నారు.