లీడర్లలో కొందరు ఎప్పుడూ డిఫరెంట్. వీళ్లు డోంట్ కేర్ లీడర్లు అన్నమాట. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా అంతే. ఎవడు ఏమనుకున్నా నాపని నాదే అనుకుంటాడాయన. నిజామాబాదులో అసమ్మతి బ్యాచ్ ఆయనకు ఎర్త్ పెట్టాలని ఇప్పటికే అన్ని అస్త్రాలు రెడీ చేసింది. అసలు సీట్ కూడా అనౌన్స్ చేయలేదు. అయినా సరే…. పోండె హే నాకు అనౌన్స్మెంట్లు… గీనౌన్స్మెంట్లతో సంబంధం లేదు… అంటూ ప్రచారం స్టార్ట్ చేశారు అరవింద్. కాన్ఫిడెన్స్ అంటే అలా ఉండాలి మరి… ఎంపిక ప్రక్రియ పూర్తవలేదు. అభ్యర్థుల లిస్ట్ బయటికి రాలేదు. మేరా నంబర్ కబ్ ఆయేగా అనుకుంటూ తెలంగాణ బీజేపీ అభ్యర్థులంతా అతృంగా ఎదురు చూస్తున్నారు. కానీ.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాత్రం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి.. క్యాంపెయిన్‌కు కొబ్బరికాయ కొట్టారు. దీని మీదే ఇప్పుడు నియోజకవర్గ బీజేపీలో చర్చ జరుగుతోంది. ఏ భరోసాతో ఆయన అడుగు ముందుకేశారని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఈసారి ఆయనకు టిక్కెట్ ఇవ్వవద్దంటూ…అర్వింద్ వ్యతిరేక వర్గం ఇప్పటికే అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసిందట. ఆయనకు వ్యతిరేకంగా బలంగా తమ గళం వినిపిస్తూ… ఎంపీ టికెట్టు రేసులో తాము ఉన్నామనీ… ఒక్క అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దల్ని కోరుతున్నారట ఎంపి వ్యతిరేక నాయకులు.
కొందరు సీనియర్లు, తటస్ధులు కూడా ఇందూరు ఎంపీ టికెట్టు కోసం అప్లై చేసుకున్నారు. పార్లమెంట్ సీటు పరిధిలోని జగిత్యాల జిల్లా క్యాడర్ ఓ అడుగు ముందు కేసి.. అర్వింద్ కు టికెట్టు ఇవ్వొద్దంటూ హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. సతీష్ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసింది. ఆయన్ని ఎందుకు వద్దంటున్నారంటే… ఎంపీగా గెలిచిన అర్వింద్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని అస్సలు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు సెకండ్ కేడర్ లీడర్స్. తమ మాట కాదని ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని శపథం చేస్తున్నారట సొంత పార్టీ కార్యకర్తలు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అందరికంటే ముందు అర్వింద్ ప్రచారం ప్రారంభించడంపై చర్చ జరుగుతోంది. అర్వింద్ ఎంపీ అయ్యాక మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లను పక్కనపెట్టి తనకంటూ ఓ గ్రూప్ తయారు చేసుకున్నారట. పార్టీ పదవుల్లో కూడా వారికే ప్రాధాన్యం ఇచ్చారట. అందుకే ఇప్పుడు లోక్‌సభ నియోజకవర్గంలో అర్వింద్ గ్రూప్, ఆయన వ్యతిరేక గ్రూప్ తయారైనట్టు చెబుతున్నారు. ఎంపీ వ్యవహారశైలితో నొచ్చుకున్న వ్యతిరేక వర్గం ఇప్పుడు టిక్కెట్ ఇవ్వవద్దంటూ ఆందోళన చేస్తోంది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసిన అర్వింద్.. బీఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఇదే విషయాన్ని వ్యతిరేక వర్గం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లిందట. ఆయనదంతా బిల్డప్ బాబాయ్ వ్యవహారమేనని, ప్రజల్లోనూ అనుకున్నంత మద్దతు లేదని పార్టీ పెద్దలకు చెప్పినట్టు తెలిసింది. ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తికి… ఎంపీ టికెట్టు ఎలా ఇస్తారని కూడా ప్రశ్నిస్తున్నారట ఆ నేతలు. కానీ… వీటితో సంబంధం లేకుండా పోటీకి రెడీగా ఉండాలంటూ పార్టీలోని ఓ ముఖ్యనేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అరవింద్ ప్రచారం మొదలెట్టేసినట్టు చెబుతున్నారు ఎంపీ సన్నిహితులు. అయితే… ఇందూరు కాషాయ పార్టీలో అసమ్మతి మాత్రం కంగారుపెడుతూనే ఉందట. ప్రజల్లో పార్టీపై సానుకూలత ఉందని, నేతలు కీచులాడుకుని ఎక్కడ ముంచుతారోనన్న కంగారు కూడా పార్టీ పెద్దలకు ఉన్నట్టు తెలిసింది. మరి ఎన్నికల టైం కాబట్టి వ్యతిరేక వర్గాన్ని కూడా కలుపుకునిపోయేలా అర్వింద్ ప్లాన్ చేస్తారో… లేక నేను మోనార్క్‌ని అన్నట్టుగా ముందుకు వెళ్తారో చూడాలి.