మాజీ మంత్రి సుజనా చౌదరికి (Sujana Chaudhary) బీజేపీ ఎంపీ టిక్కెట్టు రాలేదు. ఆయన విజయవాడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. టీడీపీ (TDP) కి చెందిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని.. వైసీపీలోకి వెళ్ళడంతో… ఇక సుజనా చౌదరికి టిక్కెట్ గ్యారంటీ అనుకున్నారు. ఎలాగూ చంద్రబాబుకు జిగినీ కాబట్టి… ఆయన కూడా అభ్యంతరం చెప్పరని భావించారు. విజయవాడా కాకపోతే… గుంటూరు లోక్ సభకి అయినా సుజనాకు టిక్కెట్ వస్తుందని భావించారు. కానీ బీజేపీ (BJP) ఎంపీ అభ్యర్థుల జాబితాలో సుజనా చౌదరికి చోటు దక్కలేదు.
2014 ఏపీ ఎన్నికల్లో సుజనా చౌదరి టీడీపీకి చాలా కీలకంగా వ్యవహరించారు. పార్టీకి పైసలు పెట్టింది కూడా ఆయనే అని చెబుతారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో సుజనాకు పరపతి కూడా పెరిగింది. దాంతో ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారు చంద్రబాబు. NDA ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కానీ 2019లో టీడీపీ ఓడిపోవడంతో… సుజనాతో పాటు ముగ్గురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. ఆయనతో పాటు బీజేపీలోకి వెళ్ళిన సీఎం రమేష్ కి అనకాపల్లి ఎంపీ టిక్కెట్టు బీజేపీ ప్రకటించింది. కానీ సుజనాకు మాత్రం టిక్కెట్ రాలేదు… ఎందుకు ఇవ్వలేదు… ఆయనకు టిక్కెట్ రాకుండా అడ్డుకున్నది ఎవరు అన్న చర్చ నడుస్తోంది.
సుజనా చౌదరికి టిక్కెట్ రాకపోవడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరియే కారణమని తెలుస్తోంది. నాలుగేల్ళుగా సుజనా చౌదరి టీడీపీ ప్రయోజనాల కోసమే తప్ప… బీజేపీకి ఏ మాత్రం సహకరించలేదన్న విమర్శలున్నాయి. అదీ గాక… ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఎంపీగా గెలిస్తే… మళ్ళీ మోడీ గవర్నమెంట్ (Modi Govt) లో మంత్రి పదవి రావడం ఖాయం. అటు పురంధేశ్వరి కూడా నెక్ట్స్ సెంట్రల్ కేబినెట్ లో మంత్రి కావాలని ఆశపడుతున్నారు. అందుకే ఎంపీగా గెలవడానికి అవకాశాలున్న రాజమండ్రిని సేఫ్ సైడ్ గా ఎంచుకున్నారు. పొత్తులో భాగంగా ఈజీగా ఎంపీ అవుతానన్న నమ్మకంతో ఉన్నారామె. అదే సుజనా కూడా ఎంపీగా గెలిస్తే… సీనియర్ కాబట్టి అతనికి మినిస్ట్రీ దక్కుతుందని పురంధేశ్వరి భావించినట్టు చెబుతున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో… ఒకరికి అవకాశం ఇస్తే… తనకు ఛాన్స్ మిస్ అవుతుందన్న ఉద్దేశ్యంతో ఆమె ఉన్నట్టు సమాచారం. సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ నుంచి అసెంబ్లీకి నిలబెడతారని అంటున్నారు. ఒకవేళ సుజన గెలిచి… ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా రాష్ట్ర మంత్రి అవడం ఖాయం. కానీ ఎంపీ అయ్యి… కేంద్రంలో మంత్రి పదవి సాధించే ఛాన్స్ మిస్సయిందని సుజనా వర్గం బాధపడుతోంది.