హమ్మయ్య.. డెడ్‌లైన్ లోపే పని పూర్తిచేశాం.. కాస్త రిలాక్స్ అవుదాం.. అని ఆఫీస్ చైర్‌లో అలా నడుం వెనక్కి వాల్చామో లేదో.. ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ మోగుతుంది.. ఇచ్చిన పని ఐపోయిందా అని ప్రశ్న వినిపిస్తుంది.. ఐపోయింది సర్ అని గర్వంగా సమాధానం చెప్పేలోపే.. ‘అప్పుడే ఐపోయిందా..అయితే ఈ పని కూడా చేసేయ్’ అని ఫోన్ పెట్టేస్తాడు బాసూ..! తిట్టుకునే టైమ్ కూడా ఉండదు..వెంటనే ఇంకో పని మొదలుపెట్టాల్సిన దుస్థితి. ఇక ఎంతో కష్టపడి..మంచి అవుట్‌పుట్ తీసుకొచ్చి.. ఇచ్చిన పని చెప్పిన టైమ్ లోపే చేసేసినా విచిత్ర వంకలు పెట్టే బాసులు ఎక్కువగా ఉంటున్నారు. ఇదే విషయాన్ని అనేక సర్వేలు, నివేదికలు చెబుతున్నాయి. ఎక్కువ మంది రిజైన్ చేయడానికి కారణాలేంటో లెక్కలతో సహా చూపిస్తున్నాయి.
టార్చర్..టార్చర్.. టార్చర్:
పని చేసే ఆర్గనైజేషన్ కోసం టార్చ్‌బేరర్‌లా నలుగురిలో స్ఫూర్తి నింపుతూ.. వ్యక్తిగత జీవితం కంటే ప్రొఫెషనల్ లైఫ్‌కే విలువనిచ్చి వర్క్ చేసే ఉద్యోగులు చాలా మంది ఉంటారు. అలాంటి టార్చ్‌బేరర్లను కూడా టార్చర్ చేసే సైకో బాసులూ ఎక్కువే ఉన్నారు. హరప్పా ఇన్సైట్స్ సర్వే ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. జాబ్స్‌కి రిజైన్ చేస్తున్న వాళ్లలో 58శాతం మంది బాస్ చేస్తున్న టార్చర్ వల్లే కంపెనీలో ఉద్యోగం మానేశామని చెబుతున్నారు. వేరే కంపెనీలకు వెళ్లినా అలాంటి బాస్‌లే దర్శనమిస్తున్నారని వాపోతున్నారు. నానారకాలుగా హింస పెడుతున్నారని..అసలు మనుషులో సైకోలో అర్థంకావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాస్‌లు ఎలా టార్చర్ చేస్తారు?:
నియంతృత్వం:
అప్పట్లో రాజులు నియంతలు.. వాళ్ల పాలన అలానే ఉండేది. వాళ్లు చెప్పిందే చేయాలి లేకపోతే ఎవరి బతుకైనా ఫసక్కే..! ఇక్కడ కూడా అంతే..! బాసులు తాము కూడా ఓ ఉద్యోగినేనన్న కనీస విచక్షణ మరిచి.. తానేదో ఎక్కువ లాగా.. మిగిలిన వాళ్లంతా తక్కువలగా ఫీల్ అవుతుంటారు. కొన్నిసార్లు ఆయనే పప్పులో కాలేస్తుంటాడు.. అప్పుడు మనం ‘మీరు పప్పులో కాలేశారు సర్’ అని చెబితే మనల్ని తుప్పల్లోకి తంతాడు. అందుకే అలాంటి వాళ్లకి ఏమీ చెప్పకుండా ఉండడం మంచిది. ఇదంతా ఓ క్యాటగిరి బాసుల సంగతి..మిగిలిన వాళ్లు మాత్రం ప్రొఫెషనల్‌గా ఉద్యోగులతో ఎలా పని చేయించుకోవాలో అలా చేయించుకుంటారు. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలకు కూడా విలువిస్తారు. అలాంటి వాళ్లతో ఎలాంటి సమస్యా ఉండదు..!
రిజైన్ చేయడానికి రెండో అతి పెద్ద కారణం ఏంటో తెలుసా?
కొన్ని ఆఫీస్‌ల్లో బాసు మంచిగానే ఉంటాడు. తోటి ఉద్యోగులు మాత్రం ఇతరులపై విషం చిమ్మే పనిలో బిజీగా ఉంటారు. ముఖ్యంగా కొత్తగా ఎవరైనా జాబ్‌లో జాయిన్ అయితే వాళ్లకి హెల్ప్ చేయాల్సింది పోయి..వాళ్లపై నెగిటివ్ ప్రచారం చేస్తుంటారు. బాస్ దగ్గర ‘ఆ కొత్త అబ్బాయి/అమ్మాయికి ఏమీ రాదు’ అని సోది చెబుతుంటారు. అసలు జాబ్‌లో జాయిన్ వర్క్ డిసైడ్ చేస్తారు. ఇలాంటి కుళ్లు రాజకీయాలు చాలా ఆఫీస్‌ల్లో కనిపిస్తుంటాయి. ఇది చాలా మంది తట్టుకోలేరు.. వీళ్లతో మనకేందుకులే అని అనుకుని ముందుకు వెళ్లే వాళ్లు కొందరుంటారు. మరికొందరు మాత్రం దెబ్బకు దెబ్బ కొట్టాలని ఆలోచిస్తుంటారు. ఇలా మన మైండ్ పాడవుతుంది. అనవసరమైన వాటిని ఆలోచించడం వల్ల సమయం కూడా వృధా అవుతుంది. అటు అప్పుడే నేర్చుకోవాడనికి వచ్చిన ట్రైనీలపై కూడా విషం చిమ్మే వాళ్లుంటారు..వాళ్ల గురించి మాట్లాడుకోని టైమ్ వేస్ట్..! ఇలా టాక్సిక్ వర్క్ కల్చర్, టాక్సిక్ కోలిగ్స్ కారణంగా 54శాతం మంది రిజైన్ చేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఆఫీస్ పాలిటిక్స్ తట్టుకోని నిలబడడం నిజంగా కష్టమే.. మన చేయాల్సింది చేసినా తర్వాత కూడా అదే స్థాయిలో విషం కక్కుతుంటే అక్కడి నుంచి బయటకు వచ్చేయడమే మంచిదని రిజైన్ చేస్తున్న ఉద్యోగుల అభిప్రాయం.