తెలంగాణలో 10 యేళ్ళ పాలించి ఓడిపోయారు. అధికారం దూరమైందన్న దు:ఖం ఓ వైపు… లీడర్లు పార్టీని వదిలిపోతున్నారన్న బాధ మరోవైపు.. మొత్తమ్మీద మాజీ సీఎం కేసీఆర్ లో ప్రస్టేషన్ పెరిగిపోతోంది. ఓట్లేసి కాంగ్రెస్ సర్కార్ ని గెలిపించిన తెలంగాణ ఓటర్లను కూడా తిట్టిపోస్తున్నారు. ఎన్నికల్లో అత్యాశకు పోయి ఓట్లేశారని మండిపడ్డారు. ఈ అహంకారమే అధికారానికి దూరం చేసిందని ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు గులాబీ బాస్ అండ్ ఫ్యామిలీ. ఇన్నాళ్ళూ అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ (BRS) నేతలు… కారు షెడ్డుకు పోయింది. బాగయ్యే ఛాన్సే లేదని ఒక్కొక్కరు దిగిపోతున్నారు.
కాంగ్రెస్ (Congress), బీజేపీకి క్యూలు కడుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు మళ్ళీ పోటీకి రావట్లేదు. నీ పార్టీ వద్దు… టిక్కెట్లూ వద్దని ముఖాన్నే చెప్పేస్తున్నారు. దాంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళే దొరకట్లేదు గులాబీ పార్టీకి. ఎలక్షన్ నాటికి ఎంతమంది పార్టీలో ఉంటారో… ఎవరు మిగులుతారో తెలియని పరిస్థితి. పార్టీ నుంచి వెళ్ళిపోయే లీడర్లను కాపాడుకుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు BRS చీఫ్ కేసీఆర్ (KCR). మేం గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరు అని సీఎం రేవంత్ రెడ్డి ఈమధ్య కామెంట్ చేయడంతో గులాబీ బాస్ లో ప్రస్టేషన్ పీక్ స్టేజ్ కి చేరింది. దాంతో కరీంనగర్ మీటింగ్ లో పార్టీ నుంచి వెళ్ళిపోయేటోళ్ళని… ఛానెళ్ళని కూడా తిట్టిపోశారు. తల మాసినోళ్ళు పోతే… పార్టీ ఖతమని బేవార్స్ ఛానెళ్ళ ప్రసారం చేస్తున్నాయన్నారు.
ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిన జనాన్ని కూడా తిట్టిపోశారు. కాంగ్రెస్ వరాలకు అత్యాశపడి… మోసపోయి ఓట్లేశారని జనంపై మండిపడ్డారు కేసీఆర్. నాకు బ్రేకులు వేయకుంటే.. సగం దేశానికి అగ్గి పెట్టేటోడిని అంటూ కామెంట్స్ చేస్తారు. BRS పార్టీ పెట్టి… పొరుగు రాష్ట్రాల్లో పోటీ చేసి.. ఏదో పొడిచేయాలి… మోడీపైన కసి తీర్చుకోవాలి… అంటూ తెగ ఊగిపోయారు. తెలంగాణలో బేస్మెంట్ కూలేసరికి పక్కనున్న మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ల్లోనూ పార్టీ జెండాలు పీకేస్తున్నారు. కనీసం ఆ ఆఫీసులకు అద్దెలు కూడా కట్టట్లేదు. అక్కడి నేతల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు.
కరీంనగర్ సభలో కేసీఆర్ ప్రస్టేషన్ మాత్రం ఓ రేంజ్ లో బయటపడింది. మేడిగడ్డలో ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగితే ప్రళయం వస్తదా… దేశం కొట్టుకుపోతదా… అంటూ ఊగిపోయారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరించడం కరెక్ట్ కాదనీ… తమ టైమ్ లో పోలీసులు దౌర్జన్యాలు చేయలేదని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా అనిపించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నాణ్యత బాగోలేదని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తే… ఎంతో మందిని జైళ్ళకు పంపిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అధికారం పోవడం… గత ప్రభుత్వంలో అక్రమాలపై రేవంత్ సర్కార్ ఎంక్వైరీ చేయిస్తుండటం, ముఖ్యనేతలు ఒక్కొక్కరు పార్టీ నుంచి వెళ్ళిపోతుండటంతోనే ఒంటరి అయిపోతున్న గులాబీ బాస్ లో ప్రస్టేషన్ పెరిగిపోతోంది.