ఆస్ట్రేలియా టూర్ లో తొలి ఓటమికి భారత్ చేరువలో నిలిచింది. అద్భుతం జరిగితే తప్ప పింక్ బాల్ టెస్టులో పరాజయం ఖాయమైనట్టే… భారత బౌలర్లు ఆలస్యంగా పుంజుకున్న వేళ ఆసీస్ భారీ ఆధిక్యాన్ని అందుకోవడమే కాదు రెండో ఇన్నింగ్స్ లోనూ మన బ్యాటర్లను దెబ్బకొట్టింది. ఫలితంగా టీమిండియా రెండోరోజే సగం వికెట్లు కోల్పోయింది. ఇంకా 29 రన్స్ వెనుకబడి ఉన్న భారత్ ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకున్నా ఆసీస్ ముందు పోరాడే లక్ష్యం ఉంచగలుగుతుందా అనేది అనుమానమే…. నిజానికి రెండోరోజు పూర్తిగా ఆస్ట్రేలియా జట్టే ఆధిపత్యం కనబరిచింది. తొలి టెస్ట్ ఓటమితో రగిలిపోతున్న కంగారూలు పింక్ బాల్ తో భారత్ ను డామినేట్ చేశారు. ఊహించినట్టుగానే కంగారు బ్యాటర్లు ఎటాకింగ్ ఆడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ సెంచరీతో దుమ్మురేపాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తే డే నైట్ టెస్టులో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. హెడ్ 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని ఈ ఫీట్ సాధించాడు.పింక్ బాల్ టెస్ట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు బాదిన రెండో ఆసీస్ బ్యాటర్‌గా ట్రావిస్ హెడ్ రికార్డ్ సాధించాడు. ఈ జాబితాలో మార్నస్ లబుషేన్ 4 శతకాలతో టాప్‌లో ఉండగా.. ట్రావిస్ హెడ్ మూడు సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ట్రావిస్ హెడ్‌కు ఇది 8వ శతకం.
హెడ్ కు ఒక లైఫ్ ఇవ్వడం భారత్ కొంపముంచింది. అతన్ని 141 పరుగులకు ఔట్ చేసినప్పటకీ ఆసీస్ కు తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యమే దక్కింది. భారత బౌలర్లలో బూమ్రా 4 , సిరాజ్ 4 వికెట్లు తీయగా… నితీశ్ రెడ్డి, అశ్విన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే రెండో ఇన్నింగ్స్ ను కాన్ఫిడెంట్ గానే ప్రారంభించిన రోహిత్ సేన వరుస వికెట్లు కోల్పోయింది. ఆరంభంలో వరుస ఫోర్లతో దూకుడుగా కనిపించిన జైశ్వాల్ ఔటవడంతో కష్టాలు మొదలయ్యాయి. తర్వాత కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీతో పాటు మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ సైతం నిరాశపరిచాడు. 28 పరుగులు చేసిన గిల్ కూడా వెనుదిరగడంతో భారత్ ఐదు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. రెండోరోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో భారత్ 128 పరుగులు చేసింది. పంత్ 5 ఫోర్లతో 28 , నితీశ్ రెడ్డి 3 ఫోర్లతో 15 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.
ప్రస్తుతం టీమిండియా 29 పరుగులు వెనుకబడి ఉండగా… మూడోరోజు తొలి సెషన్ కీలకం కానుంది. పింక్ బాల్ తో చెలరేగుతున్న ఆసీస్ పేసర్లను పంత్ , నితీశ్ ఎంతవరకూ సమర్థవంతంగా ఆడగలుగుతారనేది చూడాలి. రెండో ఇన్నింగ్స్ లో స్కాట్ బొలాండ్ 2 , కమ్మిన్స్ 2 , స్టార్క్ 1 వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యంతో రెండో టెస్టుపై ఆస్ట్రేలియా పూర్తిగా పట్టు బిగించింది. ఇక్కడి నుంచి కోలుకొని టీమిండియా మళ్లీ గాడిలో పడటం అంత ఈజీ కాదు. రెండో ఇన్నింగ్స్ లో పంత్, నితీశ్ అద్భుతం చేస్తే తప్ప ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి తప్పించుకోవడం కష్టమే. ఆసీస్ కు కనీసం 200 ప్లస్ టార్గెట్ ఇవ్వగలిగితే మ్యాచ్ పై ఆశలు పెట్టుకోవచ్చు.