Chandrababu Case: చంద్రబాబుకు బెయిలా.. కస్టడీనా.. నెక్స్టేంటి..?

చంద్రబాబుకు బెయిల్ మంజూరు అవుతుందా.. లేక హైకోర్టులో తీర్పు వాయిదా పడుతుందా.. ఈ కేసుపై పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 11:24 AM IST

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ కి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు బెయిల్ కోరుతూ ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. అదే తరుణంలో సీఐడీ బాబును తమ కస్టడీకి కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. అయితే చంద్రబాబుకు బెయిల్ వస్తుందా.. సీఐడీ కస్టడీకి ఆదేశిస్తుందా అన్నది అందరిలో నెలకొన్న ఉత్కంఠ. దీని గురించి చట్టం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం.

సీఐడీ కస్టడీ తప్పదా..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును రాజమండ్రి జైలుకు తరలించారు. ఈయనను విచారించాలని మరిన్ని కీలక అంశాలపై స్పష్టత తీసుకునే క్రమంలో సీఐడీ తన కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు లాయర్లను సూచించింది ఏసీబీ కోర్టు. అయితే దీనిపై కూడా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయినందున దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ కేసులో దర్యప్తు వేగం పెంచి సరైన ఆధారాలను సేకరించడం కోసం చంద్రబాబుకు కస్టడీ మంజూరు చేయవచ్చు. అలాగే ఇప్పటి వరకూ సేకరించిన సాక్ష్యాల ఆధారంగా వారితో పిలిపించి దర్యాప్తు మొత్తాన్ని రికార్డ్ చేస్తారు. దీనికోసం కస్టడీని ముందుగా ఒక వారం రోజులు కోరే అవకాశం ఉంది. ఆతరువాత అవసరాన్ని బట్టి, చంద్రబాబు సహకరిస్తున్న విధానం బట్టి, ఇస్తున్న సమాచారం అధారంగా కస్టడీని పొడగించవచ్చు తగ్గించవచ్చు. కస్టడీకి నిరాకరిస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఫిటీషన్ వేస్తే దానినిపై విచారణ జరిపి సరైన సమాధానం రాకుంటే దానిని తిరస్కరించి జ్యూడీషియల్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించే అవకాశం ఉంది. అంతేకాదు ఒకసారి కిందిస్థాయి కోర్టులు దర్యాప్తు సంస్థలకు జుడీషియాల్ కస్టడీకి ఆదేశిస్తే బెయిల్ రావడం అసాధ్యం అంటున్నారు కొందరు న్యాయ నిపుణులు.

లంచ్ మోషన్ పిటీషన్ అంటే..

ఏదైనా నేరాలు పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేయవల్సిందిగా ఒక పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేస్తారు. అయితే ఈ పిటీషన్ దాఖలు చేసిన మూడు రోజుల నుంచి వారంలో ఎప్పుడైనా విచారణకు రావల్సిందిగా హైకోర్టు ఆదేశిస్తుంది. చంద్రబాబుది హై ప్రొఫైల్ కేసు కనుక ఉదయం జడ్జి పర్మిషన్ తీసుకొని మధ్యాహ్నాం భోజన విరామం తరువాత విచారణకు వచ్చే లాగా చేయవచ్చు.  ఇక్కడ ఒక చిన్న అంశాన్ని గమనించాలి. లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసినప్పటికీ దానికి సంబంధిత వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కోర్టు అందించే అవకాశం ఉంది. ఎందుకంటే కౌంటర్ దాఖలు చేయకుండా ఏ కేసును విచారించకూడదు అనేది సుప్రీం కోర్టు వాదన. దీనిని గౌరవించే క్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆ కేసును తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రెండు మూడు రోజుల కాల వ్యవధి కోరే అవకాశం ఉంటుంది. ఆ తరువాత బెయిల్ పిటీషన్ విచారణకు ఆదేశించి వాదనలు వినే అవకాశం ఉంటుంది. అంటే చంద్రబాబు కేసు ఈ రోజు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసినప్పటికీ మరో రెండు మూడు రోజులు హైకోర్టులో వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.

హైకోర్ట్ లో బెయిల్ వస్తుందా..

ఏపీ ప్రభుత్వంలో చంద్రబాబు కీలక పదవిలో ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగింది. అందుకే ఇతనిని నిందితుడిగా గుర్తిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. అయితే బెయిల్ కోసం చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఎంత సాంకేతిక అంశాలను లేవనెత్తినప్పటికీ ఏకీభవించని కోర్టు సీఐడీ వాదనలకు సంతృప్తి చెందింది. అందుకే 14 రోజుల రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీనిపై లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేయనున్నారు తెలుగుదేశం తరఫు లాయర్లు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అవినీతి కేసుల్లో చిన్న కోర్టులు ఇచ్చిన కస్టడీని తొలగించేందుకు హైకోర్టుకు అధికారం లేదని తెలిపింది. అవసరమైతే 14 రోజుల రిమాండ్ గడువు ముగిసిన తరువాత బెయిల్ పిటీషన్ దాఖలు చేసుకోవాలని సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించకుండా ఎక్కడైనా స్థానికంగా హౌజ్ అరెస్ట్ చేసి ఉంటే బెయిల్ లభించే అవకాశం ఉందని చెబుతున్నారు న్యాయ నిపుణులు. ఒకసారి రిమాండులో భాగంగా సెంట్రల్ జైలులో వివరాలు నమోదు చేసి ఎంటర్ అయిన తరువాత బెయిల్ పిటీషన్ అంగీకరించడం సరైన పద్దతి కాదని సుప్రీం కోర్ట్ గతంలో క్లియర్ గా తెలిపింది. అయితే ఇలాంటి తీర్పు ఉన్న నేపధ్యంలో చంద్రబాబు కు బెయిల్ వస్తుందా రాదా అనేది వేచిచూడాలి.

T.V.SRIKAR