భారత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఐదు మ్యాచ్ ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు మ్యాచ్ లు ముగిశాయి. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ రెండో టెస్టులో ఘోర పరాజయం పాలైంది. అయితే మూడో టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ నేపధ్యలో నాలుగో టెస్ట్ ఇరు జట్లకు కీలకంగా మారింది. తదుపరి మ్యాచ్ డిసెంబర్ 26 నుండి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశం విరాట్‌కు దక్కింది. కానీ ఇందుకోసం కింగ్ 134 పరుగులు చేయాల్సి ఉంటుంది.
విరాట్ కోహ్లికి రికార్డులు కొత్తేమి కాదు. కానీ కెరీర్ చివరి దశలోనూ ఆ లెగసీని కంటిన్యూ చేయడం గమనార్హం. ఇప్పుడు డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్దమయ్యాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచే అవకాశం కోహ్లీకి దక్కనుంది. మెల్‌బోర్న్‌లో 3 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 6 ఇన్నింగ్స్‌ల్లో 52.66 సగటుతో 316 పరుగులు చేశాడు. ఈ జాబితాలో నంబర్-1 స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ మెల్‌బోర్న్ స్టేడియంలో 5 మ్యాచ్‌ల 10 ఇన్నింగ్స్‌లలో 449 పరుగులు చేశాడు. అయితే నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో విరాట్ 134 పరుగులు చేస్తే, అతను ఈ విషయంలో సచిన్ ని అధిగమిస్తాడు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. మూడు టెస్టుల్లో కోహ్లీ ఒక సెంచరీ మాత్రమే చేయగలిగాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ సెంచరీ సాధించాడు. అయితే చివరి 4 ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ కాలంలో కోహ్లీ సగటు 25.06 మాత్రమే. అయితే బ్రిస్బేన్, సిడ్నీ టెస్టుల్లో కోహ్లీ రాణించి టీమిండియాను గెలిపించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందుకోసం కోహ్లీ కూడా బాగానే కష్టపడుతున్నాడు. నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.