బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలను భారత్ సజీవంగా ఉంచుకుంది. పెర్త్ టెస్టు విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. ఈ విజయంతో భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా నుంచి నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కి అర్హత సాధించాలంటే మునుముందు వరుస విజయాలతో దూసుకెళ్లాల్సి ఉంది.
మొదటి టెస్ట్ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకునే మార్గం ఇంకా పూర్తి కాలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే ఆస్ట్రేలియాతో జరిగే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలవాల్సి ఉంది. టీమ్ ఇండియా ఇలా చేస్తే గెలుపు శాతం 69.30 అవుతుంది. అప్పుడు భారత్ ఇతర జట్లపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఈ సిరీస్‌ను 4-1తో టీమిండియా కైవసం చేసుకుంటే గెలుపు శాతం 64.04గా ఉంటుంది. అదే సమయంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-2తో టీమిండియా గెలిస్తే 58 శాతానికి చేరుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఇతర జట్లపై ఆధారపడాల్సి వస్తుంది. బోర్డర్ గవాస్కర్ తర్వాత ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ఫలితం భారత్‌కు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దక్షిణాఫ్రికా మరియు న్యూజిలాండ్ జట్లు కూడా పోటీలో ఉన్నాయి. న్యూజిలాండ్ 54.55 శాతం విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 54.17 శాతం విజయంతో ఐదో స్థానంలో ఉంది.
న్యూజిలాండ్ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ గెలిస్తే ఫైనల్‌కు చేరే అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ఓడిపోతే రేసు నుంచి తప్పుకుంటారు. అలాగే దక్షిణాఫ్రికాకు నాలుగు టెస్టులు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాకు న్యూజిలాండ్ మరియు దక్షిణాఫ్రికా జట్లు సవాళ్లు విసురుతున్నాయి. ఏదేమైనా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో భారత్ 3 కచ్చితంగా గెలవాలి. తొలి మ్యాచ్ లో బుమ్రా నాయకత్వంలో టీమిండియా సమిష్టిగా రాణించింది. టీమిండియా 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఆ తర్వాత బరిలోకి దిగిన ఆసిస్ 238 పరుగులకే కుప్పకూలింది. తొలుత భారత బ్యాటర్లు చెలరేగగా ఆ తర్వాత పేసర్లు వీరంగం సృష్టించారు. ఫలితంగా టీమిండియా చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది.