YS Jagan : జగన్ అసెంబ్లీకి వస్తారా.. కేసీఆర్‌లా డుమ్మా కొడతారా ?

గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టిన జనాలు.. ఈసారి దారుణమైన ఫలితాలను ఇచ్చారు. కేవలం 11 సీట్లకు ఫ్యాన్‌పార్టీని పరిమితం చేశారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.

గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టిన జనాలు.. ఈసారి దారుణమైన ఫలితాలను ఇచ్చారు. కేవలం 11 సీట్లకు ఫ్యాన్‌పార్టీని పరిమితం చేశారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇంకొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయ్. దీంతో జగన్ హాజరవుతారా లేదా.. లేదంటే తెలంగాణలో కేసీఆర్ చేసినట్లు.. సమావేశాలకు దూరంగా ఉంటారా అనే చర్చ జరుగుతోంది. ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయ్.

మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 175కి వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే విజయం సాధించింది. దీంతో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దీంతో ఏపీ అసెంబ్లీలో వైసిపి ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎలా ఉండబోతుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. అసలు అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఈనెల 19వ తేదీన ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో అందరు ఎమ్మెల్యేలతో పాటు, జగన్ ప్రమాణస్వీకారం చేస్తారా లేక శాసనసభ సమావేశాలు ముగిసిన తరువాత స్పీకర్ ఛాంబర్ లో ఆయన బాధ్యతలు తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.ఈ విషయంలో వైసిపి నాయకులకు కూడా జగన్ నిర్ణయం ఏంటి అనేది క్లారిటీ లేదు. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరై ప్రభుత్వానికి సహకరిస్తారా.. లేదంటే తొలి రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ప్రభుత్వం పై విమర్శలు కొనసాగిస్తారా అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది. ఐతే జగన్ మాత్రమే దూరంగా ఉంటారా.. వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా అనే చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణలో ఇలాంటి పరిస్థితే కనిపించింది. శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్ సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత స్పీకర్‌ చాంబర్‌లో ప్రమాణం చేశారు. మరి ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.