జైశ్వాల్ స్లెడ్జింగ్ కు రిప్లై ఇవ్వవా ? స్టార్క్ పై మిఛెల్ జాన్సన్ ఫైర్

స్లెడ్జింగ్... ఈ పదం వినగానే మొదట గుర్తొచ్చే జట్టు ఆస్ట్రేలియానే... ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బతీసేందుకు కంగారూలు వాడే ఆయుధమే ఈ స్లెడ్జింగ్... కానీ ఆసీస్ మాటల యుద్ధానికి వారి భాషలోనే సమాధానం చెప్పి దెబ్బకొట్టిన జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే..

  • Written By:
  • Publish Date - December 3, 2024 / 01:28 PM IST

స్లెడ్జింగ్… ఈ పదం వినగానే మొదట గుర్తొచ్చే జట్టు ఆస్ట్రేలియానే… ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బతీసేందుకు కంగారూలు వాడే ఆయుధమే ఈ స్లెడ్జింగ్… కానీ ఆసీస్ మాటల యుద్ధానికి వారి భాషలోనే సమాధానం చెప్పి దెబ్బకొట్టిన జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే.. గత పదేళ్ళుగా అంతర్జాతీయ క్రికెట్ లో ఆసీస్ ఆధిపత్యానికి అటు ఆటతోనూ, ఇటు మాటలతోనూ చెక్ పెట్టింది మనమే… అలాంటి ఆసీస్ ఆటగాళ్ళు ఇప్పుడు స్లెడ్టింగ్ కు గురవుతున్నా పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఇటీవల పెర్త్ టెస్టులో మిఛెల్ స్టార్క్ ను భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మాటలతో రెచ్చగొట్టాడు. హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తున్నప్పుడు స్టార్క్ ఓవరాక్షన్ చేయడంతో దానికి కౌంటర్ గా జైశ్వాల్ లెక్క సరిచేశాడు.

రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తున్న స్టార్క్ ను చూస్తే బంతి చాలా స్లో గా వస్తుందంటూ జైశ్వాల్ కవ్వించాడు. దీనికి స్టార్క్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక యంగ్ టీమిండియా బ్యాటర్ ఇలా ఆసీస్ బౌలర్ పై సెటైర్ వేయడం అందరినీ షాక్ కు గురి చేసింది. తాజాగా దీనిపై ఆసీస్ మాజీ పేసర్ మిఛెల్ జాన్సన్ రియాక్టయ్యాడు. స్టార్క్ లాంటి ఫాస్ట్ బౌలర్ ను జైశ్వాల్ స్లెడ్జింగ్ చేయడం ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ కు నచ్చలేదు. ఈ విషయంపై అతను తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. జైశ్వాల్ స్లెడ్జింగ్ చేసినప్పుడు స్టార్క్ తగ్గకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో ఆస్ట్రేలియా మరింత దూకుడుగా వ్యవహరించాల్సిందని చెప్పాడు. రెండు జట్ల మధ్య మాటల యుద్ధంతో జరిగే పోరాటాన్ని చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారంటూ వ్యాఖ్యానించాడు.

అయితే పెర్త్ టెస్టులో ఓడిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఒత్తిడిలో కనిపిస్తోంది. పైగా రెండో టెస్టుకు హ్యాజిల్ వుడ్ లాంటి పేస్ బౌలర్ దూరమవ్వడం మరో ఎదురుదెబ్బ. ఈ నేపథ్యంలో ఆసీస్ స్లెడ్జింగ్ కు దిగే సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే కోహ్లీ లాంటి ప్లేయర్ తో పాటు మిగిలిన భారత ఆటగాళ్ళను రెచ్చగొడితే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆసీస్ క్రికెటర్లు మాటలతో రెచ్చగొడితే భారత ఆటగాళ్ళు బ్యాట్ తోనే సమాధానమిస్తున్నారు. అందుకే టీమిండియా ప్లేయర్స్ ను రెచ్చగొట్టకపోవడమే మంచిదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.