తెలంగాణలో గవర్నర్ (Telangana Governor) కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామకం ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. గత BRS ప్రభుత్వం MLCలుగా నామినేట్ చేసిన దాసోజు శ్రవణ్ (Dasoju Shravan), కే. సత్యనారాయణ పేర్లను అప్పటి గవర్నర్ తమిళిసై (Tamilisai) రిజెక్ట్ చేశారు. తర్వాత ఆ ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. కేబినెట్ సిఫార్స్ చేసిన ఎమ్మెల్సీలను తిరస్కరించే అధికారం గవర్నర్ కు లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి పంపే అధికారం మాత్రమే ఉందని తెలిపింది.
బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో… కోదండరామ్ (Kodandaram) , అలీఖాన్ పేర్లను నామినేటెడ్ MLC పోస్టులకు సిఫార్సు చేయగా… అప్పటి గవర్నర్ తమిళసై వాటిని ఆమోదించారు. కానీ ఈ నియామకాన్ని కోర్టు కొట్టేసింది. కోర్టు తీర్పు తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి ఈ ఇద్దరి పేర్లనే… కేబినెట్ లో తీర్మానించి గవర్నర్ కు పంపింది. హైకోర్టు తీర్పు రావడంతో… మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా… ఆ ఫైల్ ను లీగల్ ఒపీనియన్ కు పంపారు. ఆ తర్వాత తమిళిసై గవర్నర్ పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడీ ఫైల్ కొత్త గవర్నర్ రాధాకృష్ణన్ చేతుల్లోకి వెళ్ళింది. రెండు రోజుల క్రితమే ఆయన ఛార్జ్ తీసుకోవడంతో… ఫైల్ ను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నాకే MLC అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అందుకు కొంత టైమ్ పడుతుందని అంటున్నారు.
బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మాత్రం… కోర్టు ఆదేశాల ప్రకారం తమనే తిరిగి ఎమ్మెల్సీలుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. తనతో పాటు కే. సత్యనారాయణ పేర్లు కాకుండా గవర్నర్ వేరే ఎవర్ని రికమండ్ చేసినా… తాము కోర్టు ధిక్కార పిటిషన్ వేస్తామంటున్నారు. తామిద్దరం వెనుకబడిన తరగతులకు చెందినవారమనీ… తమ పేర్లు రిజెక్ట్ చేయడానికి ఎలాంటి కారణాలు లేవంటున్నారు శ్రవణ్. ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని కోరుతున్నారు.
కోదండరామ్, అలీఖాన్ కు ఎమ్మెల్సీ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. కొత్త గవర్నర్ రాధాకృష్ణన్… ఈ నియామకంపై నిర్ణయం తీసుకోడానికి మరికొంత టైమ్ పట్టే అవకాశం ఉంది. దాంతో కోదండరామ్ నియామకం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్సీగా నియమితులైతే… విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.