టీమిండియాకై (Team India) నా…అండర్-19 (Under 19) కైనా…మహిళల క్రికెట్ (Women’s Cricket) జట్టుకైనా…ఫైనల్ ఫీవర్ ఉందా ? సెమీస్ దాకా రెచ్చిపోయే ప్లేయర్లు…ఫైనల్ పోరులో చేతులెత్తేస్తున్నారా? సీనియర్లైనా…జూనియర్లయినా…ఫైనల్ ప్రెజర్‌ను తట్టుకోలేకపోతున్నారా? మొదట బ్యాటింగ్ చేసినా…సెకండ్ బ్యాటింగ్ చేసినా…కొంతకాలంగా భారత్‌కు ఓటమి తప్పడం లేదు ఇటు బ్యాటర్లు…అటు బౌలర్లు…లాస్ట్ ఫైట్ లో తడబడుతున్నారు.
అండర్-19 ప్రపంచకప్ (Under 19 World Cup) ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) చేతిలో భారత్ ఓడిపోయింది. ఆరోసారి ప్రపంచకప్ ముద్దాడాలన్న జూనియర్ల కల చెదిరిపోయింది. మన కుర్రాళ్లు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో … అన్ని ఫార్మాట్లలో…అన్ని విభాగాల్లో…టీమిండియా చేజేతులా ఓడిపోయినట్టయింది. 2003 విశ్వకప్ నుంచి తాజాగా అండర్-19 ప్రపంచకప్ వరకు…ప్రత్యర్థి ఆస్ట్రేలియా అయితే…మనకు పరాజయం తప్పదనేలా సీన్ క్రియేట్ చేశారు క్రికెట్ ప్లేయర్లు. ఇది కేవలం జాతీయ జట్టుకే పరిమితం కాలేదు… మహిళల జట్టుకు ఆస్ట్రేలియా ఫీవర్ ఉంది. ఆరవీర భయంకర బౌలర్లను చెండాడిన, ఊచకోత కోసిన బ్యాటర్లు కూడా…లాస్ట్ ఫైట్‌లో ఢమాల్ అంటున్నారు. నిప్పులు చెరిగే బంతులు… గింగిరాలు తిప్పే బంతులు వేసిన బౌలర్లు… అంతిమ పోరులో చాప చుట్టేస్తున్నారు.
వన్డే లేదా టీ20 ప్రపంచకప్ (T20 World Cup) .. ఇలా ప్రతిసారి మెగా టోర్నీ రాగానే భారత్ విజేతగా నిలుస్తుందని అభిమానులు ఆశలు పెంచుకోవడం.. జట్టేమో కప్పును అందుకోకుండానే నిష్క్రమించడం పరిపాటిగా మారింది. కెప్టెన్లు మారినా.. జట్టులో మార్పులు జరిగినా.. మరో ఐసీసీ కప్పు కల మాత్రం నెరవేరడం లేదు. ధోని సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. కానీ ఆ తర్వాత రెండు వన్డే ప్రపంచకప్‌ల్లోనూ రిక్తహస్తమే మిగిలింది. 2015, 2019ల్లో సెమీస్‌లోనే జట్టు నిష్క్రమించింది. 2015లో ఆస్ట్రేలియా చేతిలో, 2019లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది.
అండర్-19 ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్ ఇప్పటి వరకు ఐదుసార్లు విజేతగా నిలిచింది. మరో నాలుగు సార్లు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2000 సంవత్సరంలో మహ్మద్ కైఫ్ నేతృత్వంలో మొదటిసారి అండర్-19 ప్రపంచకప్‌ను ముద్దాడింది భారత్. ఆ తర్వాత 2008 సౌతాఫ్రికాపై, 2012, 2018 ఆస్ట్రేలియాపై ఫైనల్ మ్యాచ్‌లో కుర్రాళ్లు విజయం సాధించారు. 2022లోనూ ఇంగ్లాండ్‌ను ఓడించింది భారత్. తాజా ప్రపంచకప్‌లో మాత్రం యంగ్ ఇండియన్స్…ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా మూడుసార్లు తలపడితే… రెండుసార్లు భారత్ పైచేయి సాధించింది.
UNDER 19 IND VS AUS 2018
2003లో జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా…రెండు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. కెప్టెన్ రిక్కీ పాంటింగ్ 140 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. జవగల్ శ్రీనాథ్, జహీర్‌ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి బౌలర్లు ఉన్నప్పటికీ…ఆస్ట్రేలియా 350కిపైగా పరుగులు చేసింది. ప్రపంచకప్ ఫైనల్స్‌లో…భారీ స్కోరు చేయడం అదే తొలిసారి. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే…భారత బౌలర్లు నిశ్చేష్టులయ్యారు. కెప్టెన్ పాంటింగ్ పూనకం వచ్చి సిక్సర్లు కొడుతుంటే…అతని బ్యాట్ లోపల ఏమైనా ఉందా అన్న అనుమానాలు వెంటాడాయి.
IND VS AUS 2003
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్…234 పరుగులకే ఆలౌట్ అయింది. సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, యువరాజ్‌సింగ్, మహ్మద్ కైఫ్ లాంటి బ్యాటర్లు ఉన్నప్పటికీ టీమిండియాకు ఓటమి తప్పలేదు. సెహ్వాగ్ 82, రాహుల్ ద్రవిడ్ 47 పరుగులతో రాణించారు. మెక్‌గ్రాత్, బ్రెట్‌లీ, ఆండ్రూ సైమండ్స్ దెబ్బకు భారత్ కకావికలమైంది. ఇండియాపై ఆస్ట్రేలియా 125 రన్స్ తేడాతో విజయం సాధించి…ప్రపంచకప్‌ను ముద్దాడింది.
IND VS AUS 2003
2023 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఫైనల్ చేరిన టీమిండియా…తుది పోరులో అభిమానులను నిరాశ పరిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో రికార్డు స్థాయిలో ఆరోసారి కప్‌ను సొంతం చేసుకుంది. హెడ్ శతకంతో విజృంభించడంతో…43 ఓవర్లలోనే 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. లబుషేన్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటయ్యింది. కోహ్లీ 54 పరుగులు, కేఎల్ రాహుల్ 66 అర్ధశతకాలు సాధించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 47 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ తీవ్రంగా నిరాశ పరిచారు. ఇప్పటి వరకు భారత్ నాలుగుసార్లు ఫైనల్ చేరితే…1983, 2011 విజేతగా నిలిచింది. మిగతా రెండుసార్లు అంటే… 2003, 2023లో ఆసీస్ చేతిలోనే పరాజయం పాలైంది. ఆసీస్ ఇప్పటి వరకు ఆరుసార్లు 1987, 1999, 2003, 2007, 2015, 2023 విశ్వవిజేతగా నిలిచింది.
వరుసగా రెండు సార్లు WTC ఫైనల్ చేరిన టీమిండియా… రెండు సార్లూ గద మాత్రం అందుకోలేకపోయింది. ఇండియాకు ప్రతిసారి ఐసీసీ ట్రోఫీల్లో ఆస్ట్రేలియా అడ్డు తగులుతోంది. 2021-23 WTC చక్రంలో భారత్ ఆధిపత్యం చలాయించినా కొంత తడబాటు తప్పలేదు. 18 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, 3 డ్రాలతో తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు తేలిపోయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469, భారత్ 296 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 270 పరుగులు చేస్తే… భారత్ 234 పరుగులకే దుకాణం కట్టేసింది. ట్రావిస్ హెడ్ భారీ శతకంతో కంగారూలకు విజయాన్ని అందించాడు. 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో విజేతంగా ఆవిర్భవించింది.
ప్రపంచకప్, టెస్టు ఛాంపియన్ షిప్, అండర్-19 ప్రపంచకప్ భయం… మహిళల జట్టుకు పట్టుకుంది. ప్రత్యర్థి ఆస్ట్రేలియా అయితే… మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే అన్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. 2020లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో… 20ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలు… 99 పరుగులకే ఆలౌటయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 85 పరుగుల తేడాతో విజయం సాధించింది.