తెలంగాణలో ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకి సమయం దగ్గర పడుతోంది. ఇదే క్రమంలో ఈ సారి కొత్తగా ఎన్నికల బరిలోకి దిగేందుకు జనసేన ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఇక్కడి లోకల్ లీడర్లతో వరుస సమావేశాలు ఏర్పాటు చేసింది. అందులో తమ పార్టీ క్యాడర్ పై తమకు ఉన్న బలాబలాలపై తీవ్రమైన చర్చ జరిగింది. జనసేన తరఫున పోటీ చేసే నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అన్నింటినీ శ్రద్దగా విన్న పవన్ ఈ సారి 32 నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మన్నటి వరకూ తెలంగాణ జనసేన పార్టీ నాయకులు ఏదో ఒక వేదిక పై ప్రజల సమస్యలను వినిపిస్తూ వస్తున్నారు. గతంలో కొందరైతే అరెస్ట్ అయిన పరిస్థితి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కమిటీలను నియమించుకుని ముందుకు సాగుతున్నారు. కొన్ని చోట్ల అయితే పోలింగ్ బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నట్లు లోకల్ అభ్యర్థులు అధినేతకు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పాటూ ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ తరుణంలో నియోజకవర్గాల వారీగా సర్వే కూడా చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా పోటీలో నిలిచి తన సత్తాను చూపించుకోవలాని ఉవ్విళూరుతోంది.
బీజేపీ పెద్దలతో మంతనాలు..
ఏపీలో జనసేన టీడీపీతో పొత్తును బాహాటంగా ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ అధినేత ఎలా చెబితే అలా నడుచుకునేందుకు సిద్దంగా ఉంది. ఇక బీజేపీ జనసేనతో కలిసి ఉన్నప్పటికీ వారు కూడా తమతో రావాలని పవన్ ఇచ్చిన పిలుపు పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఈ తరుణంలో తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలు ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటూ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ను జనసేనాని కలిశారు. పొత్తుపై తీవ్రంగా చర్చించారు. ఈ భేటీలో పవన్ తమ పార్టీ నాయకులు అభిప్రాయాన్ని బీజేపీ పెద్దలతో పంచుకున్నారు. బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు వివరించారు. గతంలో తెలంగాణ బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. సీట్ల పంపకాల్లో ఏవైనా తేడాలు వస్తే తమ పార్టీ క్యాడర్ నిరుత్సాహానిక గురవుతుందని స్పష్టం చేశారు.
రెండు రోజుల్లో పొత్తుపై రానున్న స్పష్టత
ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేశారు. అక్కడి వైసీపీ అరాచకాలను ఎండగడుతున్నారు. అభివృద్ది, సంక్షేమంపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గురిపెడుతున్నారు. అందులో భాగంగా వారాహి యాత్ర పేరుతో ఇప్పటికే చాలా నియోజకవర్గాలు చుట్టేశారు. ఒకవేళ తెలంగాణలో పోటీ చేయాల్సి వస్తే పవన్ తప్పకుండా రాజకీయ ప్రచారాలలో పాల్గొనాల్సి ఉంటుంది. అప్పుడు ఏపీలో వారాహి యాత్ర నిమ్మెదించే అవకాశం ఉంటుంది. దీంతో పాటూ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమకు బలం ఉన్న నియోజకవర్గాలను కేటాయిస్తుందా లేదా.. అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీట్ల సర్థుబాటు విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా లేదా అనే అంశంపై కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని రెండు రోజుల్లో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది.
T.V.SRIKAR