నిజానికి పార్టీ చీఫ్‌గా రేవంత్ ఉండడం.. సీనియర్లకు ఏ మాత్రం ఇష్టం లేదు. అధిష్టానం మాట కాదనలేక.. అలా అడ్జస్ట్ అయిపోతున్నారంతే ! అప్పటికీ టైమ్ దొరికినప్పుడల్లా.. రేవంత్ మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఇంచార్జికి కూడా మార్చాల్సి వచ్చింది.. అది వేరే సంగతి ! సీనియర్లు ఎన్ని ఫిర్యాదులు చేసినా.. రేవంత్ విషయంలో అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం.. రేవంత్ తర్వాత సరైన నాయకుడు లేకపోవడమే !
రేవంత్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే.. పార్టీని ముందుకు నడిపించే నాయకత్వం కొరత ఏర్పడుతుందని.. ఎన్ని పిర్యాదులు వచ్చిన అధిష్టానం చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తూ వచ్చింది. ఐతే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా గట్టి పోటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టు ఉన్న నాయకుడిగా పొంగులేటికి పేరుంది.
గతంలో బీఆర్ఎస్‌లో ఉన్న కారణంగా.. కేసిఆర్ వ్యూహాలను అంచనా వేయడంలోనూ.. గులాబీ పార్టీ లొసుగులను తెరపైకి తీసుకురావడంలోనూ.. పొంగులేటి ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. వీటన్నింటికి తోడు.. కాంగ్రెస్‌లో దాదాపు అందరు నేతలతోనూ పొంగులేటికి మంచి సంబంధాలు ఉన్నాయ్. ఇది ఆయనకు కచ్చితంగా కలిసొచ్చే అంశమే. ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకొని.. పార్టీలో పొంగులేటికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది హైకమాండ్. పార్టీలో చేరగానే ప్రచార కమిటీ కో చైర్మన్‌గా కీలక బాధ్యతలు అప్పగించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పొంగులేటికి ఏ స్థాయిలో ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ! ఇదే కంటిన్యూ అయితే.. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి స్థానానికి ఎసరు వచ్చినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదనే చర్చ జరుగుతోంది.