తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా ఆధిపత్య పోరు జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా దాదాపు ఆరుగురు పార్టీ నేతలు ఇవాళ సీక్రెట్ గా భేటీ అయ్యారు. ఒక సీనియర్ నాయకుడి ఇంట్లో సమావేశమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీలో తమకు ప్రయారిటీ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న ఆ లీడర్లు.. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ పార్టీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్ వెంకట స్వామి, రవీంద్ర నాయక్, రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి.. బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు తమ ఫ్యూచర్ ప్లాన్ పై ఒక నిర్ణయాన్ని ప్రకటించే దిశగా కసరత్తు చేస్తున్నారు.
కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి..
కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైనప్పటి నుంచి రాష్ట్రంలో పార్టీ యాక్టివిటీ తగ్గిపోవడం, సీఎం కేసీఆర్ ప్రధాన టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ మారడం అనేది బీజేపీలో రెబల్స్ గా మారిన ఆరుగురు మంది కీలక నేతలకు నచ్చడం లేదని తెలుస్తోంది. ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా ప్రయోజనం దక్కదనే ఒపీనియన్ తో వారు ఉన్నారు. బీజేపీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కు పార్టీలో మితిమీరిన ప్రయారిటీ ఇస్తున్నారని రెబల్ లీడర్స్ అభిప్రాయపడుతున్నారు. తమతో ఏ మాత్రం సంప్రదించకుండానే.. తమ నియోజకవర్గాల పరిధిలోని ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి ఈటల రాజేందర్ చేర్చుకుంటున్నారని రెబల్ లీడర్స్ ఆరోపిస్తున్నారు. ఒంటెత్తుపోకడ పోతున్నారని ఈటల తీరుపై వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. బీజేపీలో ఉండటం వల్ల అవమానాల పాలు కావడమే కానీ గౌరవం ఏనాటికీ దక్కదన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
అమిత్ షాతో మీటింగ్ కు నో ఇన్వైట్..
బీజేపీలో పేరుకు పదవులు ఇచ్చారు కానీ.. పార్టీ కార్యకలాపాలపై తమ అనుచరులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని వారి అనుచరులు వాపోతున్నారు. కిషన్‌రెడ్డి ఇటీవల చేపట్టిన దీక్షకు సంబంధించి కూడా ఈ ఆరుగురు కీలక నేతలకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. తాజాగా సెప్టెంబరు 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ సభను బీజేపీ నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసేందుకు ఈ ఆరుగురు కీలక నేతలు ట్రై చేసినా.. కలువనీయ లేదని తెలుస్తోంది. దీనిపైనా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్ వెంకట స్వామి, రవీంద్ర నాయక్, రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. అమిత్ షా కేవలం కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌లతో సమావేశమవడంతో.. జాతీయ స్థాయి పార్టీ పదవుల్లో ఉన్న తమను పక్కనపెట్టడంపై ఈ లీడర్లు ఆవేదనకు గురయ్యారట. ఇంకా ఎన్నాళ్లు బీజేపీలో కొనసాగినా.. పరిస్థితి ఇంతేనన్న అభిప్రాయానికి వారు వచ్చారట. ఈ ఆరుగురు లీడర్లలో ఎవరెవరు.. ఏయే పార్టీలో చేరుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ లే ఎక్కువనే అంచనాలు వెలువడుతున్నాయి.