సెలక్టర్లు చివరి ఛాన్స్ ఇస్తారా ? రిటైర్మెంట్ కు రెడీ అయిన పేసర్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ రిటైర్మెంట్ కు రెడీ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే సొంతగడ్డపై జరిగే బంగ్లాదేశ్ సిరీస్ తో చివరి మ్యాచ్ ఆడాలని భావిస్తున్నట్టు సమాచారం.

  • Written By:
  • Publish Date - August 19, 2024 / 12:50 PM IST

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ రిటైర్మెంట్ కు రెడీ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే సొంతగడ్డపై జరిగే బంగ్లాదేశ్ సిరీస్ తో చివరి మ్యాచ్ ఆడాలని భావిస్తున్నట్టు సమాచారం. సెలక్టర్లు చివరి అవకాశం ఇస్తే ఘనంగా కెరీర్ ముగించాలని ఇశాంత్ ఎదురుచూస్తున్నాడు. పలువురు యువ బౌలర్లు రావడంతో ఇశాంత్ జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో ఆడుతున్న ఈ ఢిల్లీ పేసర్ చివరిగా 2021‌లో భారత్ కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లోనూ యువ ఆటగాళ్ళతో కలిసి పోటీ పడుతున్న ఇషాంత్ యువ క్రికెటర్లకు కొన్ని సూచనలు అందించాడు.ప్రతీ ప్లేయర్ తన సామర్థ్యంపై నమ్మకం ఉంచి కష్టపడాలని ఈ సీనియర్ పేసర్ సూచించాడు.

పట్టుదల ఉంటే ఏ ఫార్మాట్ లోనైనా రాణించగలమని ఇషాంత్ చెప్పుకొచ్చాడు. భారత్ తరఫున ఇషాంత్ 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 115,పొట్టి ఫార్మాట్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. భారత్ సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఇషాంత్‌కు గౌరవ ముగింపు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తే.. బంగ్లాదేశ్ లేదా న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ లో అతన్ని ఎంపిక చేసే అవకాశముంది. సర్జరీ చేయించుకుని కోలుకున్న షమి ఫిట్ నెస్ సాధించకుంటే ఇషాంత్ కు చివరి ఛాన్స్ దక్కొచ్చు.